ఇక నుంచి వాతావారణ సమాచారం ప్రతి గ్రామపంచాయతీలో అందుబాటులోకి రానుంది. వచ్చే వారం నుంచి వాతావరణ అంచనాలను గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) వెల్లడించింది. అయితే కేవలం ఇంగ్లీష్లోనే కాదు.. ఇక నుంచి హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఈ సమాచారం అందుబాటులో ఉండనుంది. ఏడాదిపాటు జరిగే ఐఎండీ 150వ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ‘ప్రతి చోటా వాతావరణం.. ఇంటింటికీ వాతావరణం’ పేరుతో ఈ కొత్త సేవను అదేరోజు ప్రారంభిస్తున్నారు.
వాతావరణం వల్ల జరిగే నష్టాల నుంచి చిన్న రైతులను ఆదుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. వాతావరణ సూచనల్ని మండలాల (బ్లాకుల, తాలూకాల) స్థాయి నుంచి గ్రామాలకు తీసుకువెళ్లడం సాధ్యమైందని తెలిపారు. పంచాయతీ స్థాయి వాతావరణ సేవల ద్వారా దేశంలో ప్రతి గ్రామంలో కనీసం అయిదుగురు రైతులతో అనుసంధానం కావాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. తీవ్రమైన వాతావరణ హెచ్చరికలతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమశాతం, గాలుల వేగం వంటి వివరాలను ‘పంచాయతీ వాతావరణ సేవ’ ద్వారా పొందవచ్చని చెప్పారు.