పశ్చిమ బెంగాల్లో ఎట్టకేలకు సోమవారం రోజున పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. పటిష్ఠ బందోబస్తు నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2024 జనరల్ ఎలక్షన్స్‌కు కొన్ని నెలల ముందు పంచాయతీ ఎన్నికలు జరగడంతో అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్నికల ఓటింగ్ రోజున బెంగాల్లో పెద్ద ఎద్దున హింస చెలరేగింది. రాజకీయ ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, బాలెట్ పేపర్లకు నిప్పంటించడం, చెరువుల్లో పడేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6100కుపైగా పోలింగ్ బూతుల్లో ఈ నెల 8న పోలింగ్ నిర్వహించారు. 80.71 శాతం పోలింగ్ నమోదయింది. అయితే పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగడంతో 19 జిల్లాల్లోని 696 బూత్‌లలో సోమవారం రీ పోలింగ్ జరుగగా 69.85 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.