లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో తేల్చడానికి 48 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదని తెలిపారు. కూటమిలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీయే ప్రధాని పదవికి హక్కుదారని, అదే సహజమైన విషయమని ఆయన స్పష్టం చేశారు.
“ఈసారి ఇండియా కూటమికి దిగువ సభలో మెజారిటీకి అవసరమైన 272కంటే ఎక్కువ స్థానాలు వస్తాయి. మా కూటమికి మెజార్టీ స్థానాలు వస్తే ఎన్డీఏలోని కొన్ని పార్టీలు మాతో కలిసే అవకాశం ఉంది. అయితే వారిని చేర్చుకోవాలా వద్దా అనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్డీఏలోని జేడీయూ ఎన్నికల అనంతరం పొత్తుకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. కూటములు మార్చటంలో బిహార్ సీఎం నీతీశ్ కుమార్ మాస్టర్. ఇండియా కూటమికి ఎన్డీఏకు తేడా ఏమిటని ప్రశ్నిస్తే 2 ‘ఐ’లు…ఇన్సానియత్, ఇమాందారి మాత్రమే తేడా” అని జైరాం రమేశ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.