ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వానాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వం ఎనిమిదేళ్లపాటు హరితహారం పేరుతో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. గత లోపాలను సరిదిద్దుతూ.. వన మహోత్సవం కార్యక్రమానికి సిద్ధమైంది.
హైదరాబాద్ నగరవాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా, జీవ వైవిద్ధ్యాన్ని పెంపొందించేలా విస్తృత స్థాయిలో మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రచించింది. వర్షాకాలం ముగిసేలోపు 30 లక్షలకు పైగా చెట్లను నాటేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం కాలనీ పార్కుల్లోని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.
ప్రధాన రహదారులపైగాక కాలనీ రోడ్లు, విభాగినులు, అంతర్గత రహదారులు, మోడల్ కారిడార్ల పొడవునా అలంకరణ జాతులకు చెందిన మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ కింద విస్తృతంగా నాటనున్నట్లు యూబీడీ విభాగం వెల్లడించింది. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో 38,400 మొక్కలను మియావకి పద్ధతిలో నాటాలని బల్దియా నిర్ణయించింది.