దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతోంది. రోజూ 3.50 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మార్చి నెల నుంచి కోవిడ్ కేసులు మళ్లీ విపరీతంగా పెరిగిపోయాయి. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ రావడం వెనుక పలు కారణాలు ఉన్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. వాటిని ఆయన తాజాగా వెల్లడించారు.
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కరోనాను నియంత్రించడంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకముందే కరోనాపై విజయం సాధించామని ప్రకటించారని ఆరోపించారు. అనేక దేశాల్లో కోవిడ్ సెకండ్, థర్డ్ వేవ్‌లు వచ్చాయని, భారత్‌లో కూడా అలాగే వచ్చేందుకు అవకాశం ఉందని తెలిసి కూడా అందుకు ముందస్తుగా సిద్ధం అవ్వలేదని, కరోనా అంతమైనట్లు ప్రవర్తించారని, అందుకే కోవిడ్ సెకండ్ వేవ్ అంతగా ప్రబలుతుందని అన్నారు.
కాగా రఘురామ్ రాజన్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఫైనాన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అయిందని, ఇప్పుడు కూడా అలాగే చేస్తే మళ్లీ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తుందని, అందుకే కేంద్రం లాక్డౌన్ వైపు మొగ్గు చూపడం లేదని నిపుణులు అంటున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చేయి దాటుతున్నందున లాక్ డౌన్ పెట్టడం తప్ప వేరే దారి లేదని అంటున్నారు.