సాధారణంగా వాహనదారులు ట్రాఫిక పోలీసులకు, వారి కెమెరాలకు దొరకకుండా ఉండేందుకు గాను రక రకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. కొందరు నంబర్ ప్లేట్లు కనిపించకుండా చేస్తారు. ఇక కొందరైతే నంబర్ ప్లేట్లలో కొన్ని అంకెలు లేకుండా వాటిని పెడతారు. అయితే ఆ మహిళ మాత్రం ఏకంగా రతన్ టాటాకు చెందిన కార్ నంబర్ ప్లేట్‌ను తయారు చేసుకుని తన కారుకు అమర్చి వాడింది. కానీ ఎట్టకేలకు పోలీసులకు అసలు విషయం తెలిసిపోయింది.
ముంబైలో రతన్ టాటాకు ఎంహెచ్01 డికె 0111 అనే నంబర్ ఉన్న కారు ఉంది. అయితే సరిగ్గా అదే నంబర్‌తో ఓ మహిళ నంబర్ ప్లేట్ తయారు చేసుకుని దాన్ని తన కారుకు అమర్చి వాడింది. ఈ క్రమంలో ఆమె ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడల్లా ముంబై ట్రాఫిక్ పోలీసులు ఇ-చలాన్లను వేసి ఆ చలాన్లను రతన్ టాటా ఆఫీస్‌కు పంపారు. అయితే ఆ చలాన్లు పడిన ప్రాంతాల్లో అసలు రతన్ టాటా కారు తిరగలేదని, బహుశా ఎవరో నకిలీ నంబర్ ప్లేట్‌ను వాడుతుండవచ్చని రతన్ టాటా ఆఫీస్ అధికారులు పోలీసులకు తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులు అసలు విషయం తెలుసుకుని నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న ఆ కారు కోసం గాలించడం మొదలు పెట్టారు. వారికి అక్కడి మాతుంగ ఏరియాలో ఫైవ్ గార్డెన్స్ అనే ప్రాంతంలో ఆ నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారు అయితే లభ్యమైంది. కానీ అందులో ఎవరూ లేరు. అయితే ఓ మహిళ ఆ కారును అక్కడ విడిచిపెట్టి పోయిందని పోలీసులు గుర్తించారు. కానీ ఆమె ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేందుకు, చలాన్ ఎగ్గొట్టేందుకు ఆ నంబర్ ప్లేట్‌ను వాడలేదని, అది ఫ్యాన్సీ నంబర్ కనుక తన స్నేహితుల ఎదుట షో చేసేందుకే ఆమె ఆ నంబర్ ప్లేట్‌ను వాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో వారు ఆమె కోసం ప్రస్తుతం వెతుకుతున్నారు.