జీవితం చాలా చిన్నది. వయసు వచ్చాక సెటిల్ అవ్వాలని చాలా మంది భావిస్తుంటారు. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఎదగాలనే ఆశ, ఆకాంక్ష ఉంటుంది. కానీ జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు, పొరపాట్ల కారణంగా గమ్యం చేరకుండా మధ్యలోనే ఆగిపోతాం. ప్రతి ఒక్కరికీ ఇలాంటి సమస్య ఎదురవుతూనే ఉంటుంది. కానీ మనం చేసే పనిని మనం గౌరవిస్తే జీవితంలో ఎదుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి జీవితం మీద పూర్తి అవగాహన ఎవరికీ ఉండదు. మనకోసం మనం ఆలోచించినా.. పక్క వాళ్ల కోసం వెనుకడుగు వేసినా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. సమస్యలు ఎదురైనప్పుడు మనలోమనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సాధారణంగా మనిషి తప్పులు చేయడం సహజం. అయితే తప్పులు చేసినప్పుడు ఆ తప్పులకు గల కారణాలేంటో గ్రహించాలి. తెలుసుకుని రియలైజ్ అవ్వాలి. అయితే సాధారణంగా మనిషి చేసే చిన్న చిన్న తప్పుల గురించి తెలుసుకుందాం రండి.
ఎక్కువగా ఆలోచించడం..
ఎవరైనా ఏ మాట అన్నా.. చాలా మంది అతిగా ఆలోచించడం మొదలు పెడతారు. భవిష్యత్ విషయంలోనూ అంతే. అలా ఆలోచించడం వల్ల వర్తమానంలో విఫలమవుతుంటారు. ప్రస్తుత జీవితానికి అనుగుణంగా నడుచుకుంటూ.. సక్సెస్ వైపు అడుగులు వేయాలి. నేటి సమాజంలో యువత సోషల్ మీడియాలో ఎక్కువ సేపు గడిపేస్తుంటారు. సోషల్ మీడియా అనేది ప్రపంచం వాస్తవ జీవితానికి భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి.
అశ్లీల వీడియోలు చూస్తూ..
ప్రస్తుతం ఇంటర్ నెట్ యుగం. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతే అనర్థం ఉంటుంది. ఈ ప్రభావం యువతపై ఎక్కువగా చూపిస్తుంది. ఆశ్లీల వీడియోలు చూస్తూ ఆ దిశగా అడుగులు వేసేస్తుంటారు. అలాగే అనవసరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ కాలం వెల్లదీస్తుంటారు.
మరొకరితో పోల్చుకోవడం..
ఒకరిలా ఆలోచించే మనుషులు నూటికి ఒక్కరుంటారు. పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు మనుషులను మార్చేస్తుంటారు. ఎదుగుతున్న, చదువుతున్న వాళ్లని చూస్తూ మనుషులు సహజంగానే వారిలా తమ పిల్లలు కావాలని పోల్చేస్తుంటారు. ప్రతిభకు తగ్గట్టుగా గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం, సహాయం అందిస్తే బాగుంటుంది.
వీటితోపాటు ఎవరినీ ఎక్కువగా నమ్మకపోవడం మంచిది. ప్రస్తుతం కాలంలో కన్నకొడుకులే వదిలేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. కల్పితాలను నమ్మకపోవడం మంచిది. ఇతరులతో వాదించడం కూడా శ్రేయస్కరం కాదు.