మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్‌సౌర్ జిల్లాకు చెందిన ఓ మహిళ హెలికాప్టర్‌ను కొనుగోలు చేసేందుకు లోన్ కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరింది. ఈ మేరకు ఆమె ఆయనకు లేఖ రాసింది. సదరు మహిళకు సంబంధించిన పొలానికి వెళ్లకుండా పక్కనే పొలం ఉన్న ఇంకో వ్యక్తి దారిని బ్లాక్ చేశాడు. దీంతో తన పొలానికి వెళ్లేందుకు దారిలేదని, హెలికాప్టర్‌లోనే వెళ్లాలని, కనుక తనకు దాన్ని కొనుక్కునేందుకు లోన్ ఇప్పించాలని కోరుతూ ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది.
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లా బర్ఖెడా గ్రామానికి చెందిన బసంతి బాయి ఆ లేఖను రాయగా ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన సమస్యపై ఇప్పటికే అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయింది. దీంతో ఆమె ఓ టైపిస్టు వద్దకు వెళ్లి లేఖను రాయించి దానిపై సైన్ చేసి, వేలి ముద్ర పెట్టి మరీ రాష్ట్రపతికి లేఖ పంపింది. అయితే దానికి ఇంకా సమాధానం రాలేదు.
కానీ ఆ లేఖ వైరల్ కావడంతో అక్కడి ఎమ్మెల్యే యశ్‌పాల్ సింగ్ స్పందించారు. తాను ఆమెకు సహాయం చేస్తానని, ఆమె సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని, కానీ హెలికాప్టర్‌ను మాత్రం అందివ్వలేనని తెలిపారు. ఇక ఆమె రాసిన లేఖ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలోవైరల్ అవుతూనే ఉంది.