క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విజిలెన్స్ విభాగం నివేదిక వెల్లడించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేసింది. విచారణలో భాగంగా పలు లోపాలను గుర్తించినట్లు పేర్కొంది.
‘ఈ డ్రగ్స్ కేసు విచారణలో కొందరి అధికారుల తీరు అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు బృందం గుర్తించింది. ఆర్యన్ ఖాన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించినందున.. ఆ కేసును సరైన రీతిలో దర్యాప్తు చేయలేదు. అయితే ఇదంతా ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది’ అని ఆ నివేదిక వెల్లడించింది. ఎన్‌సీబీ ముంబయి యూనిట్‌లో విధులు నిర్వహించిన అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సహా ఇతర అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది.
ముంబయి తీరంలోని ఓ క్రూజ్ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో ఆర్యన్ ఖాన్ ఉండటంతో గతేడాది ఈ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 28 రోజుల పాటు జైల్లో ఉన్న అతడు.. అక్టోబరు 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. అయితే, ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో.. ఈ కేసులో ఎన్సీబీ అతడికి ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.