దేశంలో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో ప్రమాదం ఎక్కువవుతోంది. ఇప్పటికే రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య 2 లక్షలను దాటింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ కట్టడికి అనేక చర్యలు చేపడుతున్నాయి. అయితే కోవిడ్ కొత్త వేరియెంట్ల వల్ల ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్లోనూ వైరస్ పాజిటివ్ అని రావడం లేదు. కొత్త కోవిడ్ వేరియెంట్ అసలు టెస్టులకు దొరకడం లేదు. దీంతో బాధితులను కోవిడ్ పాజిటివ్ అని నిర్దారించడం కష్టతరమవుతోంది. అయినప్పటికీ వారిలో కోవిడ్ తాలూకు లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ టెస్టుల్లో మాత్రం పాజిటివ్ అని రావడం లేదు.
అయితే కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ అని రాకపోతే పలు ఇతర టెస్టులు చేయించుకోవాలని, దీని ద్వారా వైరస్ ఉందీ, లేనిదీ తెలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డి-డైమర్ టెస్టు – ఇది ఒక బ్లడ్ టెస్టు. దీని వల్ల శరీర భాగాల్లో బ్లడ్ క్లాట్స్ గురించి తెలుస్తుంది. ఈ విలువ లీటర్‌కు 0.5 ఎంజీ మాత్రమే ఉండాలి. ఎక్కువగా ఉండరాదు. ఉంటే కోవిడ్ గా అనుమానించాలి.
సీఆర్‌పీ – దీన్నే సి రి-యాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఇది లివర్‌లో తయారవుతుంది. శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఉందని చెప్పడానికి సూచిక ఇది. టెస్టులో ఫ్లుయిడ్ శాతం 10 కన్నా తక్కువగా ఉండాలి. లీటర్‌కు 100 ఎంజీ కన్నా ఎక్కువగా ఉంటే ప్రమాదకరంగా భావించాలి.
ఫెర్రిటిన్ – ఈ టెస్టు ద్వారా వచ్చే విలువ 500కు మించరాదు. అలా జరిగితే శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానించాలి.
ఇంటర్‌లుకిన్-6 – ఈ టెస్టు ద్వారా ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉందీ, లేనిదీ తెలుస్తుంది. దీంతో కోవిడ్ వచ్చింది, రానిది నిర్దారించవచ్చు.
కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వస్తుంటే పైన తెలిపిన టెస్టులను చేయించుకోవచ్చు. దీంతో కోవిడ్ పాజిటివ్ లేదా నెగెటివ్ అనేది నిర్దారణ అవుతుంది.