ఊర్లలో అయితే పక్కింటి వారికి ఎంతసేపూ ఎదురింటి వాళ్లు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు ఇలాంటి వాటిపైన శ్రద్ధ ఉంటుంది. ఇది ఒక్కోసారి మనకు చిరాకుగా అనిపిస్తుంది కానీ.. మనల్ని పలకరించడానికి కనీసం వాళ్లైన ఉన్నారు. యోగక్షేమాలు అడుగుతున్నారు. సిటీల్లో అలాకాదు.. తిన్నావా అని అడిగేంత టైమ్ కూడా పొరుగింటి వాళ్లకు ఉండదు. రెండేళ్లపాటు పక్కింటి మనిషి కనిపించకపోయినా.. ఆమె ఏమైందన్న ఆలోచన ఎవరికీ రాలేదు. అసలే వృద్ధురాలు..అయినా ఎవరూ పట్టించుకోలేదు. సీన్‌కట్ చేస్తే చనిపోయి ఆస్థిపంజరంలా మారింది. అసలేంటి కథ..అలా ఎలా జరిగింది.?
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని పెకామ్‌లో జరిగిన కథ ఇది. షీలా సెలోనీ ఒంటరి మహిళ. అక్కడి ఒక హౌజింగ్ సొసైటీలోని ఇంట్లో అద్దెకు ఉంటోంది. క్రోన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. చివరి సారి ఆమె 2019 ఆగస్ట్‌లో బయట కనిపించింది. డెంటల్ డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుని, అక్కడికి వెళ్లి వచ్చింది. ఆ తరువాత నుంచి ఆమె బయట ఎవరికీ కనిపించలేదు. ఎందుకు కనిపించడం లేదన్న ఆరా కూడా అక్కడ ఎవరూ తీయలేదు. రెండేళ్ల తరువాత, అనుమానం వచ్చి, ఇంటి లోపల చెక్ చేయగా.. ఆమె అస్థిపంజరం లివింగ్ రూమ్‌లోని సోఫాలో కనిపించింది. శరీరమంతా శుష్కించిపోయి, అస్థిపంజరంలా సోఫాలో మిగిలిపోయింది. అంటే రెండేళ్లకు పైగా ఆ ఇంట్లోకి ఎవరూ రాలేదు.
రెండేళ్లగా రెంట్ కడుతూనే ఉంది..
హైలెట్ ఏంటంటే.. గత రెండేళ్లకు పైగా ఆమె హౌజింగ్ సొసైటీకి అద్దె కడ్తూనే ఉంది. నిజానికి ఆమె చనిపోయిన తరువాత కొన్ని నెలల పాటు అద్దె బకాయి పడింది. ఆ సమయంలో హౌజింగ్ సొసైటీ వారు ఆమె సోషల్ బెనిఫిట్స్ నుంచి అద్దె వసూలు చేయడం ప్రారంభించారు. అది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఈ మధ్య ఏ సమయంలోనూ ఆమె గురించి తెలుసుకోవాలని వారు ఆలోచించలేదు. అంతేకాదు జూన్ 2020లో ఆమె గ్యాస్ కనెక్షన్‌ను కూడా వారు కట్ చేశారు. ఆ సమయంలో కూడా ఏం జరిగి ఉంటుందనే ఆలోచన వారికి రాలేదు. రెగ్యులర్ చెకింగ్ సమయంలో ఆమె నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో గ్యాస్ కనెక్షన్‌ను కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని వారు కోర్టుకు తెలిపారు.
కోర్టు విచారణ
ఈ ఘటనపై స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో.. స్థానిక సౌత్ కొరొనర్ కోర్టు ఇండిపెండెంట్ విచారణ ప్రారంభించింది. ఈ దారుణం లోతులను గుర్తించడం కూడా చాలా కష్టం` అని ఈ సందర్భంగా కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్ల పాటు మరణాన్ని గుర్తించలేకపోవడం.. అదీ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో.. ఇంకా దారుణం` అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఆ హౌజింగ్ సొసైటీపై కోర్టు మండిపడింది. దాంతో ఆ సొసైటీ క్షమాపణ వ్యక్తం చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె గురించి కొందరు రెసిడెంట్లు ఆరా తీశారని, పోలీసులకు కూడా సమాచారమిచ్చారని సమాచారం. పోలీసులు విచారణకు వచ్చిన సమయంలో అక్కడి ఒక మహిళ.. ఇటీవలనే ఆమెను చూశానని వారికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. కానీ ఆమె చనిపోతే బాడీ నుంచి దుర్వాసన రావాలి..ఆ వాసనకు అందరికి తెలుస్తుంది. మరీ వాసన కూడా రాలేదా..? వచ్చినా లైట్ తీసుకున్నారా..?