కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో చూస్తూనే ఉన్నాం. ఇక మారుమూల పల్లెల్లో అయితే ఈ తంటాలు అంతా ఇంతా కాదు. అయితే ఈ కరోనా టెస్టును సులభతరం చేసేందుకు నాగ్‌పూర్ కు చెందిన ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ సెలైన్ గార్గుల్ ఆర్టీపీసీఆర్ విధానాన్ని డెవలప్ చేసింది.
ఇప్పటి వరకు కరోనా పరీక్ష చేయాలంటే ఓ స్వాబ్ ను ముక్కు, లేదా గొంతులో ఉంచి శాంపిల్ తీసుకుంటారు. దానిని లాబొరేటరీలో పరీక్షించి కరోనా రిజల్ట్ చెబుతారు. ఇదంతా చాలా ప్రాసెస్. కానీ సెలైన్ విధానంలో టెస్టు చేసుకోవడం చాలా సులభం.
సెలైన్ గార్గుల్ విధానంలో.. ఎవరికి వారే శాంపిల్ తీసుకోవచ్చు. జస్ట్ సెలైన్ లిక్విడ్‌ను నోట్లో పోసుకొని 15 సెకన్ల పాటు బాగా పుక్కిలించాలి. ఇలా పుక్కిలించిన దాన్ని ఓ ట్యూబ్‌లో ఉమ్మివేయాలి. దాన్ని ల్యాబ్‌లో 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. ఆ తర్వాత 6 నిమిషాల పాటు 98 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. తద్వారా RNAను ఎక్ట్‌ట్రాక్ట్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఈ విధానంలో కేవలం మూడు గంటల్లోనే కరోనా రిజల్ట్ వస్తుంది. ఇది చాలా సులభం.