ఏపీలో సుదీర్ఘమైన పాదయాత్ర తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 151 సీట్ల భారీ మెజార్టీతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం అయ్యారు. తొలి ఐదు నెలల పాలనా కాలంలో జగన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు. గ్రామ సచివాలయాలతో లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన జగన్ సరికొత్త వ్యవస్థతో ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు.
మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీలో దూకుడు చూపిస్తూ.. ఎవరెవరు అయితే పార్టీ కోసం, తన కోసం త్యాగాలు చేశారో వారిని గౌరవిస్తున్నారు. ఒక్క ఇసుక కొరత విషయంలో మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ జగన్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. గ్రామ వలంటీర్ల వ్యవస్థతో చాలా మంది సంతృప్తిగా ఉన్నారు. ఇవన్నీ ఎలా ? ఉన్నా జగన్‌కు ఫ్యూచర్‌లో పెద్ద సవాల్ ఎదురు కానుంది.
జగన్ గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం నానా రచ్చ రచ్చ చేశారు. ప్రత్యేక హోదా కోసమే తాను మాట మీద ఉన్నానని… బాబు పదే పదే యూటర్న్‌లు తీసుకున్నారని విమర్శించడంతో పాటు తమ పార్టీ ఎంపీలతో కూడా జగన్ రాజీనామాలు చేయించి ఆమోదింపజేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ ఆ ఊసే ఎత్తడం లేదు.
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా ఉద్యమంతో హైలెట్ అయిన జగన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో లాలూచి పడ్డారా ? అందుకే హోదా అంశాన్ని మర్చిపోయారా ? అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏపీలో మరోసారి ఈ హోదా ఉద్యమాన్ని చలసాని శ్రీనివాస్ లాంటి నేతలతో పాటు పలువురు తలకెత్తుకోనున్నారు. ఇదే జరిగితే ఈ ఉద్యమానికి విపక్షాలు మరోసారి మద్దతు ఇవ్వడం ఖాయం.
అప్పుడు జగన్ ఎస్ అంటే ఓ తంటా, నో అంటే మరో తంటా. నిజానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని గట్టిగా జనంలోకి పంపించి వైసీపీ ఇన్ని సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ ఉద్యమం స్టార్ట్ అయితే జగన్ ఖచ్చితంగా ఎస్ అనాలి. అప్పుడు బీజేపీ నుంచి మరింతగా విమర్శలు తప్పవు. అందువల్ల జగన్ ఇదివరకటిలా ఫోర్స్ గా హోదా అన్న మాట అనలేరు. రేపో మాపో ప్రతిపక్షాలు, హోదా ఉద్యమకారులు హోదా ఉద్యమం తీవ్రతరం చేస్తే జగన్ ఇరకాటంలో పడక తప్పదు.