మంకీపాక్స్‌లో కొత్త స్ట్రెయిన్‌.. కీలక విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్‌

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేసిన కరోనా రక్కసి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ ప్రజలపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న మంకీ పాక్స్ వైరస్ లో కూడా వేర్వేరు స్ట్రెయిన్లు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే యూరప్ లో విజృంభిస్తున్న స్ట్రెయిన్, ఇండియాలో బయటపడిన రకం వేర్వేరు అని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)’ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా పరిశోధన చేశారు. ఇతర దేశాల సంస్థల నుంచి డేటా తీసుకోవడంతోపాటు కేరళలో బయటపడిన రెండు కేసుల శాంపిళ్లలోని మంకీ పాక్స్ వైరస్ ను డీఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి పరిశీలించారు. ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాల్లో వ్యాప్తిలో ఉన్న మంకీ పాక్స్ వైరస్ బీ.1 స్ట్రెయిన్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల మీదుగా కేరళకు వచ్చిన వారిలోని మంకీ పాక్స్ స్ట్రెయిన్ ను ఏ.2 రకంగా తేల్చారు. యూరప్ లో పెద్ద సంఖ్యలో కేసులు రావడానికి కారణమైన మంకీ పాక్స్ స్ట్రెయిన్ బీ.1 రకం కావడం గమనార్హం. ‘‘మనుషుల నుంచి మనుషులకు సంక్రమించడం మొదలుపెట్టి ఏకంగా 70 దేశాల్లో 16 వేలకుపైగా కేసులు నమోదవడానికి, ముఖ్యంగా యూరప్ దేశాల్లో భారీగా వ్యాపించడానికి కారణం బీ.1 వేరియంట్ మంకీ పాక్స్ అని గుర్తించారు. 2022 మొదట్లోనే ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి మొదలైంది. భారత దేశంలో గుర్తించిన మంకీ పాక్స్ వైరస్ ఏ.2 వేరియంట్. ఇది భారీగా విస్తరించే అవకాశం లేదని భావిస్తున్నాం.”అని సీఎస్ఐఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటగ్రేటివ్ బయాలజీ శాస్త్రవేత్త వినోద్ స్కారియా తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version