విజ‌యారెడ్డి హ‌త్య కేసులో లంచం ట్విస్ట్‌..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దారు విజయారెడ్డి సజీవ దహనం కేసు కొత్త మలుపు తిరిగింది. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి హత్య చేసిన సురేష్ ముదిరాజ్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు ఎటు మ‌లుపులు తిరుగుతుందా ? అన్న ఆస‌క్తి నెల‌కొంది. మ‌రో వైపు పోలీసులు మాత్రం సురేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాక కారులో ఉన్న కొంద‌రితో మాట్లాడాడ‌ని తేల‌డంతో వారు ? ఎవ‌రు ? అయ్యి ఉంటారా ? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ టైంలోనే ఈ కేసులో మ‌రో ట్విస్టు వెలుగు చూసింది. హంత‌కుడు అయిన సురేష్ భార్య ల‌త సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయారెడ్డి లంచం అడగడం వల్లనే ఆమెను బెదిరించడం కోసం సురేష్ పెట్రోల్ తీసుకెళ్లాడని ఆరోపిస్తోందామె. సురేష్ భార్య అయితే విజ‌యారెడ్డిని చంపాల‌న్న ఉద్దేశం త‌న భ‌ర్త‌కు ఎంత మాత్రం లేద‌ని.. అయితే అత‌డు కేవ‌లం బెదిరించాల‌ని మాత్ర‌మే అనుకున్నాడ‌ని… అందుకే పెట్రోల్ తీసుకు వెళ్లాడ‌ని.. అయితే ఆఫీస్‌లో మాటా మాటా పెర‌గ‌డంతో చివ‌ర‌కు స‌హ‌నం కోల్పోయి పెట్రోల్ పోసి నిప్పంటించాడ‌ని ఆమె చెపుతోంది.

సంఘ‌ట‌న జ‌రిగిన రోజు త‌న భ‌ర్త సురేష్ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ త‌న‌కు ఈ మాట చెప్పాడ‌ని ఆమె అంటోంది. అంతే కాకుండా త‌న భ‌ర్త ఎమ్మార్వో విజ‌యారెడ్డితో కొద్ది రోజులుగా త‌ర‌చూ క‌లుస్తున్నాడ‌ని.. ఈ క్ర‌మంలోనే త‌న భ‌ర్త రు.9 ల‌క్ష‌లు అప్పు కూడా చేశాడ‌ని.. అయితే ఈ డ‌బ్బులు ఎవ‌రికి ఇచ్చాడో మాత్రం త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. విజయారెడ్డి లంచం అడిగిందనే విషయాన్ని సురేష్ తనకు చెప్పాడన్న ఆమె ఆ డ‌బ్బులు ఎవ‌రికి ఇచ్చాడ‌నేది మాత్రం చెప్ప‌లేదంటోంది.

అంటే ఆమె మాట‌ల‌ను బ‌ట్టి విజ‌యారెడ్డి లంచం అడిగిన‌ట్టు చెపుతున్నా.. ఆ డ‌బ్బు ఆమెకు ఇచ్చాడా ? లేదా ? అన్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఆమె వ్యాఖ్య‌లు మాత్రం ప‌రోక్షంగా విజ‌యారెడ్డికే ఆ లంచం ఇచ్చిన‌ట్టు చెప్పిన‌ట్ల‌య్యింది. ఏదేమైనా సురేష్ భార్య లత వ్యాఖ్యలతో ఈ కేసు మరో కొత్త మలుపు తీసుకుంది. పోలీసులు మాత్రం ల‌త వ్యాఖ్య‌ల‌ను న‌మ్మ‌కుండా.. సురేష్ విజ‌యారెడ్డిని చంపాక బ‌య‌ట‌కు ప‌రిగెత్తుతూ కారులో ఉన్న వారితో మాట్లాడిన‌ట్టు కొంద‌రు చెప్ప‌డంతో ? వాళ్లు ? ఎవ‌రై ఉంటారా ? అని ఆరా తీస్తున్నారు.