ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించలేనంతగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన వాళ్లతో పాటు తనను నమ్ముకున్న నేతలకు ఏదో ఒక పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తున్నారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలకు సైతం కార్పొరేషన్ పదవులు ఇస్తున్నారు.
జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అండగా ఉన్న లక్ష్మీపార్వతి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం రాజకీయ వర్గాల్లో కాస్త ఆసక్తిగా మారింది. వాస్తవంగా వినపడుతున్న సమాచారం ప్రకారం.. లక్ష్మీపార్వతి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆమె జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన వాయిస్ బలంగా వినిపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య కావడంతో ఆమెకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చారు.
ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు ఎలాంటి పదవి కట్టబెడతారు ? అన్నది ఆసక్తిగా మారింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా వాయిస్ వినిపించిన రోజా, వాసిరెడ్డి పద్మ లాంటి వాళ్లకు జగన్ ఇప్పటికే కీలక పదవులు ఇచ్చారు. లక్ష్మీ పార్వతికి ఇంకా ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో ఆమె కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నట్టు వార్తలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు కీలక నామినేటెడ్ పదవులను జగన్ భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీలో ఆర్టీసీ చైర్మన్ పదవి ఖాళీ అయింది.
టీడీపీకి చెందిన వర్ల రామయ్య ఆ పదవికి ఎట్టకేలకు రాజీనామా చేయడంతో ఈ పదవి లక్ష్మీపార్వతికి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో మొదలైంది. నామినేటెడ్ పదవుల్లో కాస్తోకూస్తో ప్రయార్టీ ఉన్న ఆర్టీసీ చైర్మన్ పదవి కోసం వైసీపీలో చాలా మంది ఆశావహులు ఉన్నప్పటికీ… జగన్ ఇవ్వాలనుకుంటే లక్ష్మీపార్వతికి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు సైతం ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే లక్ష్మీ పార్వతి మాత్రం ఎమ్మెల్సీ కావాలన్నా ఆశ ఉన్నట్టు తెలుస్తోంది. మరి జగన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి.