ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాక… రాజకీయమేనా.?

-

ఎన్నడూలేంది, ఎన్‌హెచ్‌ఆర్‌సి నిందితుల పక్షాన వకాల్తా పుచ్చుకుని మరీ తెలంగాణ పోలీసులను వేటాడుతోంది. దీనికి తోడు పౌరహక్కుల పేరుతో కోన్‌కిస్కాగాళ్లందరూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.మానవ హక్కులు కేవలం నిందితులకేనా అనే ప్రశ్నకు వీరెవరి వద్దా జవాబు ఉండదు..

నేషనల్‌ హ్యుమన్‌ రైట్స్‌ కమిషన్‌ – జాతీయ మానవ హక్కుల సంస్థ. దేశంలో మానవ హక్కులను కాపాడటానికి ఏర్పాటయిన న్యాయ సంస్థ. 1993 అక్టోబర్‌లో ప్రారంభించబడిన ఈ కమిషన్‌, 1991లో పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల వర్క్‌షాపులో పేర్కొన్న సూత్రాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. ఒక చైర్మన్‌, నలుగురు సభ్యులు, నలుగురు ఎక్స్‌-ఆఫిషియో సభ్యులుండే ఈ కమిషన్‌లో చెర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సభ్యులలో ఒకరిగా మాజీ న్యాయమూర్తి ఉంటారు.
మానవహక్కుల పరిరక్షణ, ప్రోత్సాహానికి భారత రాష్ట్రపతి ద్వారా నియమితమైన ఈ సంస్థ, మానవహక్కులంటే ఇచ్చే నిర్వచనం..

‘‘ఒక వ్యక్తి జీవనం, స్వేచ్చ, సమానత్వం మరియు గౌరవానికి సంబంధించిన హక్కులకు భారత రాజ్యాంగం లేదా అంతర్జాతీయ ఒడంబడికల హామీ’’

ఇవీ స్థూలంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ విధివిధానాలు. ఎక్కడైనా మానవహక్కులకు విఘాతం కలిగినప్పుడు, అది కూడా ప్రభుత్వ విభాగాలు, సైన్యం, ఇతర సాయుధ బలగాల ద్వారా జరిగినప్పుడు సుమొటుగా కేసును స్వీకరించి విచారించే అధికారం ఈ కమిషన్‌కు ఉంది. ఎక్కువగా పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లు వీరి పరిధిలోకే వస్తాయి. అంతే కాని, నక్సలైట్లు పోలీసులను చంపినప్పుడు, కరుడుగట్టిన నేరస్థులు అమాయకులను హత్య చేసినప్పుడు వీరు స్పందించరు.

అయితే, సాయుధ బలగాల అకృత్యాలకు సామాన్యులు బలి కాకూడదనే మానవహక్కుల మౌలిక సూత్రాన్ని విస్మరించి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు ప్రపవర్తిస్తున్నట్లు ఈ కమీషన్‌పై తరచూ ఆరోపణలు వస్తున్నాయి. మానవహక్కులు నిందితులతో పాటు బాధితులకు కూడా సమానమే అనే విధానాన్ని పూర్తిగా పక్కనబెట్టి, కరడుగట్టిన హంతకుల వైపే వాదించడానికి దర్యాప్తు చేస్తూ, ఆత్మరక్షణకో, న్యాయపరిరక్షణకో వారిని తుదముట్టించిన సాయుధ బలగాలను వేధించడం ఎన్‌హెచ్‌ఆర్‌సికి పరిపాటిగా మారింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో, హుటాహుటిన హైదరాబాద్‌కు తరలివచ్చిన ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందం, పోలీసులను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలని, జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని రుజువు చేయాలని బాగా ఉబలాటపడుతున్నట్లు అందరికి అర్థమయింది.  దిశ తల్లిదండ్రులను ఒక రకంగా, నిందితుల తల్లిదండ్రులను ఇంకో రకంగా ప్రశ్నించడం, ఎన్‌కౌంటర్‌ సందర్భంగా గాయపడ్డ పోలీసులను గంటలు గంటలు గుచ్చిగుచ్చి ప్రశ్నించడం చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతోంది ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఉద్దేశమేమిటో.

నిర్భయ ఉదంతం జరిగి ఏడేళ్లయినా, నిందితులు ఇంకా హాయిగా ఉన్నారు.ఇక్కడ ఎన్‌హెచ్‌ఆర్‌సీ లేదు. ఉన్నావ్‌ ఘటనకు జాతి మొత్తం సిగ్గుతో తలవంచుకుంది. ఇక్కడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ లేదు. హాజీపూర్‌ శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ ప్రవీణ్‌.. ఇలా ఎక్కడా ఉండదు. కానీ, దిశ విషయంలో ఎగురుకుంటూవచ్చింది. ఎందుకు? ఎందుకంటే, ఎక్కడా, ఏ దురాగతంలోనూ జరగని ‘న్యాయం’  ఇక్కడ జరిగింది కాబట్టి. దాంతో ఏళ్ల తరబడి సాగుతూ ఉన్న పై కేసుల విషయంలో కేంద్రంపై మునుపెన్నడూ లేనంత ఒత్తిడి పెరిగింది. ఇది సహజంగానే బిజేపీ పెద్దలకు రుచించలేదు. కేసీఆర్‌ సర్కార్‌కు ఇంత మంచిపేరు రావడం మోడీకి, ముఖ్యంగా అమిత్‌ షాకు అస్సలు నచ్చలేదు. పైగా తమతో సరైన సఖ్యత కూడా లేని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్లే ప్రయత్నమే ఈ ఎన్‌హెచ్‌ఆర్‌సీ రాక.

కానీ, దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, సెలెబ్రిటీలు, అంతర్జాతీయ సమాజం అంతా, అందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను వేనోళ్ల పొగిడినవాళ్లే.  ఈ ఎన్‌కౌంటర్‌తో సమాజం ఎదురుచూసిన భయం నేరస్థుల్లో ప్రవేశించింది. దాని ఫలితమే దారుణ హత్యాఘటనల్లోని నిందితులు భయంతో ఆత్మహత్యలు చేసుకోవడమే.సరే… పౌరహక్కుల పేరుతో కొన్ని కుక్కమూతిగడ్డలు ఎలాగూ ఇటువంటప్పుడు మొలకెత్తుతుంటాయి.  వాటిని లెక్కచేయనవసరం లేదు. సరైన న్యాయం జరిగిందనుకున్నప్పుడు ఎవరికీ భయపడనవసరం లేదు.

సూపర్‌ కాప్‌ సజ్జనార్‌ సుప్రీంకోర్టులో వాదనలు స్వయంగా వినపించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆయనకదేం కొత్త కాదు. వరంగల్‌ యాసిడ్‌ దాడి కేసులో కూడా ఆయన పలుమార్లు విచారణనెదుర్కొన్నారు. ఇంకా ఎదుర్కోవడానికి తెలంగాణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

‘‘లోకకంటకులే లోకనాథులుగా చలామణీ అవుతున్నప్పుడు, అధర్మమే ధర్మంగా పేట్రేగుతున్నప్పుడు, అన్యాయమే న్యాయంగా చెలరేగినప్పుడు…….. సరైన న్యాయం అన్యాయంగా చేసినా తప్పులేదు.’’

-రుద్రప్రతాప్‌

 

Read more RELATED
Recommended to you

Latest news