హైదరాబాద్‌లో మళ్లీ నైట్‌ కర్ఫ్యూ ? నగర వాసుల్లో భిన్నాభిప్రాయం

-

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో హైదరాబాద్‌లో మళ్లీ ఆంక్షలు విధిస్తారా..లేక నైట్‌ కర్ఫ్యూ విధిస్తారా అన్న చర్చ మొదలైంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులతో పాటు సామాన్య ప్రజలు కూడా బెంబేలెత్తుతున్నారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు పోలీసులు. పక్క రాష్ట్రాల్లో విధించినట్లుగానే నగరంలో కూడా నైట్ కర్ఫ్యూ విధించాలా అనే విషయమై నగరవాసులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. అయితే దేశంలో కరోనా పరిస్థితి సీరియస్‌గా ఉందన్న ఆయన.. నైట్‌ కర్ఫ్యూని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంలకు సూచించారు ప్రధాని. దీంతో, ఇప్పుడు నైట్‌ కర్ఫ్యూపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు. అయితే కేసులు ఎక్కువ అవుతున్నప్పటికీ.. నైట్ కర్ఫ్యూ మాత్రం సాధ్యం కాదని కొందరంటున్నారు.

కఠిన నిబంధనలు పెట్టి జనాన్ని కట్టడి చేయడం తప్ప ఇప్పుడేం చేయలేమనే అభిప్రాయమూ పలువురు నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. అయితే మాస్క్ లేకుండా విచ్చలవిడిగా తిరిగేవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొరడా ఝళిపిస్తోంది. 1000 రూపాయలు జరిమానా విధిస్తోంది. అయితే, లాక్ డౌన్ మాత్రం వద్దేవద్దంటున్నారు ఇంకొందరు. కాలేజీలు మాత్రమే మూసివేయడం సరికాదని.. పబ్బులు రెస్టౌరెంట్స్ కూడా మూసివేయాలని కోరుతున్నారు మరికొందరు.

నగరంలో కొంతమంది మాత్రం తప్పనిసరిగా నైట్ కర్ఫ్యూ విధించాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి ఏదైనా అమలు చేయడం సాధ్యమే కాబట్టి.. మహారాష్ట్ర మాదిరే ఇక్కడ కూడా కచ్చితంగా కర్ఫ్యూ విధించాలంటున్నారు. అప్పుడే అనవసరంగా రోడ్లమీదకు వచ్చేవారు ఇంటికి పరిమితమవుతారని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version