బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌ల‌ను ఎగ్గొట్టిన నీర‌వ్‌మోడీ.. లండ‌న్‌లో ప్ర‌త్య‌క్షం..!

-

నీర‌వ్ మోడీ లండ‌న్‌లో చాలా స్వేచ్ఛ‌గా తిరుగుతూ క‌నిపించాడ‌ని ఓ ప్ర‌ముఖ బ్రిటిష్ వార్తా ప‌త్రిక త‌న వెబ్‌సైట్‌లో ఓ వీడియోను కూడా విడుద‌ల చేసింది. లండ‌న్‌లోని వెస్ట్ ఎండ్ స్ట్రీట్‌లో నీర‌వ్ మోడీ క‌నిపించాడు.

లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా మ‌న దేశంలోని అనేక బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి ఎంచ‌క్కా లండ‌న్‌లో తిరుగుతున్న విష‌యం విదిత‌మే. అత‌ను అడ‌పాద‌డ‌పా అక్క‌డ క‌నిపిస్తూనే ఉంటాడు. ఈ క్ర‌మంలోనే మాల్యాను ఇండియాకు తీసుకొచ్చేందుకు భార‌త అధికారులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే బ్యాంకుల‌కు పంగ‌నామం పెట్టిన మ‌రో ఘ‌నుడు నీర‌వ్ మోడీ కూడా లండ‌న్‌లోనే తిరుగుతున్నాడు. అత‌ను తాజాగా లండ‌న్ వీధుల్లో తిరుగుతూ ద‌ర్శ‌నమిచ్చాడు.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయ‌ల కుచ్చు టోపీ పెట్టిన ఆర్థిక నేర‌స్థుడు నీర‌వ్ మోడీ విదేశాల‌కు పారిపోయాడ‌ని తెలిసిందే. అయితే అత‌ను ఎక్క‌డికి వెళ్లాడో ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌లేదు. కానీ తాజాగా అత‌ను లండ‌న్ వీధుల్లో తిరుగుతుండ‌డాన్ని కొంద‌రు చూసి అత‌ని ఫొటోను క్లిక్‌మ‌నిపించారు. దీంతో ఇప్పుడు నీరవ్ మోడీ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయల‌ను ఎగ్గొట్టిన నీర‌వ్ మోడీ లండ‌న్‌లో రాజాగా బ‌తుకుతున్నాడ‌ని ఆ ఫోటోల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

నీర‌వ్ మోడీ లండ‌న్‌లో చాలా స్వేచ్ఛ‌గా తిరుగుతూ క‌నిపించాడ‌ని ఓ ప్ర‌ముఖ బ్రిటిష్ వార్తా ప‌త్రిక త‌న వెబ్‌సైట్‌లో ఓ వీడియోను కూడా విడుద‌ల చేసింది. లండ‌న్‌లోని వెస్ట్ ఎండ్ స్ట్రీట్‌లో నీర‌వ్ మోడీ క‌నిపించాడు. ఈ క్ర‌మంలో స‌ద‌రు బ్రిటిష్ ప‌త్రిక జ‌ర్న‌లిస్టు నీర‌వ్ మోడీని ప‌లు ప్ర‌శ్న‌లు కూడా అడిగాడ‌ట‌. అయితే వాటికి నీర‌వ్‌.. నో కామెంట్ అని స‌మాధానం చెప్పాడ‌ట‌. ఈ క్ర‌మంలో స‌ద‌రు జ‌ర్న‌లిస్టు నుంచి త‌ప్పించుకుని నీర‌వ్ అదృశ్య‌మ‌య్యాడ‌ట‌. కాగా నీర‌వ్ క‌నిపించిన స‌మ‌యంలో అత‌ను ధ‌రించిన కోటు ఖ‌రీదు రూ.7 ల‌క్ష‌లు ఉంటుంద‌ని మీడియా క‌థ‌నాలు అప్పుడే వ‌స్తున్నాయి.

ఇక నీర‌వ్ మోడీ లండ‌న్‌లోని సెంట‌ర్ పాయింట్ ట‌వ‌ర్ బ్లాక్‌లో ఉన్న ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడ‌ట‌. దానికి నెల‌కు రూ.15 ల‌క్ష‌ల‌కు పైగానే అత‌ను అద్దె చెల్లిస్తున్నాడ‌ట‌. అలాగే ద‌గ్గ‌ర్లో ఉన్న సోహోలో అత‌ను వ‌జ్రాల వ్యాపారం కూడా చేస్తున్నాడ‌ని తెలిసింది. ఈ క్ర‌మంలోనే అత‌ను రోజూ త‌న స్టోర్‌కు వెళ్లి వ‌చ్చేందుకు వీలుగా స్టోర్‌కు దగ్గ‌ర్లోనే ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నాడ‌ని స‌మాచారం. అయితే లండ‌న్‌లో ఏ వ్యాపారం చేయాల‌న్నా నేష‌న‌ల్ ఇన్సూరెన్స్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి. కానీ భార‌త్‌లో అత‌ను అన్ని వేల కోట్ల రూపాయ‌ల‌ను ఎగ్గొడితే అత‌నికి లండ‌న్‌లో ఆ నంబ‌ర్ ఎలా వ‌చ్చి ఉంటుందా.. అని ఇప్పుడు ప‌లువురు విస్మ‌యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. మాల్యా లాగే నీర‌వ్ కూడా ప్ర‌జ‌ల డ‌బ్బుతో లండ‌న్‌లో ద‌ర్జాగా బ‌తుకుతున్నాడ‌ని అత‌న్ని చూస్తేనే మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news