తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఏపీ డేటా చోరీ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది. ఏపీ ప్రజల డేటాను తెలుగుదేశం పార్టీ తన సేవా మిత్ర యాప్‌లో వేసుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. డేటా చోరీ కేసును కర్త, కర్మ, క్రియ ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ అని తెలుస్తున్న నేపథ్యంలో ఉచ్చు తమ మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు చంద్రబాబు.. తన తొత్తు శివాజీని రంగంలోకి దించారు.
సినీ నటుడు స్థాయి నుంచి యూటర్న్ తీసుకొని చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న శివాజీ.. ఇదివరకే ఆపరేషన్ గరుడ అంటూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ డేటా చోరీ కేసుపై ఏబీఎన్ చానెల్‌లో మాట్లాడుతూ.. ఏపీ డేటా చోరీ కేసును తెలంగాణ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్‌పై బురద జల్లారు. చంద్రబాబు నీతిమంతుడని.. ఆయనకు ఏం తెలియదని.. దీనికంతటికీ సీఎం కేసీఆర్‌కే మూల బిందువంటూ చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే.. ఏపీ డేటా చోరీ కేసు బయటికి రాగానే.. శివాజీని చంద్రబాబు రంగంలోకి దించి.. ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి శివాజీతో స్కెచ్ వేయించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు అన్నీ బాగానే సెట్ చేశారు కానీ.. సీఎం కేసీఆర్‌పై బురద జల్లడానికి శివాజీని వాడుకోవడంతో అది చంద్రబాబుకే ఎదురు తన్నింది. ఎందుకంటే.. శివాజీ ఇదివరకే ఆపరేషన్ గరుడ, ఇంకా ఏదోదో చెప్పి ఇదివరకు అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారని.. దానికి ఓ అర్థంపర్థం ఉండదని.. ఇదంతా చంద్రబాబు స్క్రిప్టేనని తెలుస్తోంది.
ఏదిఏమైనా.. చంద్రబాబు ఎన్ని కుయుక్తులకు పాల్పడినా.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. శివాజీతో విమర్శలు చేయించినా.. ఇంకేం చేయించినా.. ఏపీ ప్రజల డేటా చోరీ జరిగిందనేది వాస్తవం అని తెలుస్తూనే ఉన్నది. ప్రజల డేటాను అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టిన చంద్రబాబును వదిలేది లేదని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. అసలు ఏపీ ప్రజల డేటాతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవసరమే లేదు. తెలంగాణ ప్రజల డేటా సేవా మిత్ర యాప్‌లో ఉందని ఓవైపు సిట్ దర్యాప్తులో వెల్లడవుతుంటే.. తెలంగాణ ప్రజల డేటా.. టీడీపీ సేవా మిత్ర యాప్‌లోకి ఎలా వచ్చిందనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు చంద్రబాబు స్కెచ్ ఏంటి? ఆయన కేసీఆర్‌పై బురద ఎందుకు జల్లిస్తున్నారు? జగన్‌ను సీఎం చేయడానికి కేసీఆర్.. చంద్రబాబును అడ్డంగా ఇరికిస్తున్నారు.. అనే శివాజీ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదు. అవన్నీ కావాలని చేస్తున్న ఆరోపణలని శివాజీ మాటల్లోనే అర్థమవుతూనే ఉన్నది. దీనిపై సిట్ దర్యాప్తు పూర్తయితే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.