హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ.. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాపై కోర్టులో కేసు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీస్ ఎన్‌టీఆర్. ఈ సినిమాను వర్మ ఈ నెల 22వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పుడీ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాను విడుదల కాకుండా చూడాలని టీడీపీ యత్నిస్తోందట. అందులో భాగంగానే ఈ సినిమాను ఆపేందుకు టీడీపీ టీం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ.. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాపై కోర్టులో కేసు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ సినిమాలో నందమూరి కుటుంబాన్ని, సీఎం చంద్రబాబును కించ పరిచేలా పలు సన్నివేశాలు ఉన్నాయని, కనుక సినిమా విడుదల అయితే తమ మనోభావాలు దెబ్బతింటాయని ఆరోపిస్తూ లక్ష్మీస్ ఎన్‌టీఆర్ విడుదల కాకుండా చూడాలని బాలకృష్ణ కోర్టును కోరనున్నారట. ఈ క్రమంలో కోర్టు ద్వారా సదరు చిత్రయూనిట్‌కు నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.
కాగా లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమాలో వర్మ ఏం చూపించనున్నాడో ప్రజలందరికీ తెలిసిందే. లక్ష్మీపార్వతి ఎన్‌టీఆర్ జీవితంలోకి వచ్చాక జరిగిన పలు ముఖ్యమైన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారని ముందే తెలిసింది. ఈ క్రమంలోనే.. సినిమా విడుదల అయితే తమపై అది నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని, అసలే ఎన్నికల సమయం కనుక ఆ సినిమా విడుదల అయితే అది తమకు వచ్చే ఓట్ల శాతాన్ని కూడా తగ్గిస్తుందని టీడీపీ భావిస్తున్నదట. అందుకే ఆ పార్టీ లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలకు అడ్డు పడుతున్నట్లు తెలిసింది. మరి వర్మ అన్ని అవాంతరాలను ఎదుర్కొని ఈ సినిమాను విడుదల చేస్తారా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!