ఎట్టకేలకు ఉరి.. ఏడున్నరేండ్లుగా ఎప్పుడేం జరిగిందో తెలుసా మరి!

-

నిర్భయ తల్లి ఆశాదేవి పోరాటం ఫలించింది. ఆమె కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డ నరరూప రాక్షసులకు కొంత ఆలస్యంగానైనా తగిన శాస్తి జరిగింది. ఏడున్నరేండ్ల నాడు నిస్సహాయురాలైన ఓ ఆడపిల్లపై వీధికుక్కల్లా విరుచుకుపడ్డ మానవ మృగాలకు ఎట్టకేలకు ఉరిశిక్షలు అమలయ్యాయి. తీహార్‌ జైలు అధికారులు భారత కాలమానం ప్రకారం శుక్రవారం (మార్చి 20న) ఉదయం 5.30 గంటలకు దోషులు నలుగురికి ఉరిశిక్షలు అమలుచేశారు. అయితే ఉరితీత గడువుకు రెండు గంటల ముందు వరకు కూడా శిక్షల అమలుపై స్టే తెచ్చుకునేందుకు దోషుల ప్రయత్నాలు కొనసాగాయి. కానీ, ఢిల్లీ హైకోర్టు గురువారం అర్ధరాత్రి, సుప్రీంకోర్టు శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఉరిశిక్షల అమలుపై స్టేకు నిరాకరించాయి. దీంతో జైల్‌ నెంబర్‌-3లో దోషులు నలుగురిని ఏకకాలంలో ఉరితీశారు. ఈ నేపథ్యంలో నిర్భయపై దారుణం జరిగినది మొదలు ఇప్పటి వరకు ఎప్పుడేం జరిగిందో ఒక్కసారి గుర్తుచేసుకుందాం..

- Advertisement -

2012, డిసెంబర్‌ 16న ఢిల్లీలో 23 ఏండ్ల పారామెడికల్‌ విద్యార్థిని నిర్భయ స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఇద్దరూ ఓ ప్రైవేటు బస్సు ఎక్కారు. ఇదే నిర్భయపాలిట శాపంగా మారింది. ఆ బస్సు డ్రైవర్‌, బస్సులో ఉన్న 17 ఏండ్ల బాలుడు సహా మొత్తం ఆరుగురు మానవమృగాలు దారుణానికి ఒడిగట్టారు.

ఇనుపరాడ్డుతో నిర్భయ స్నేహితుడి తల పగులగొట్టి, తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక ఆమె జననావయవాల్లో ఇనుపరాడ్డు పెట్టి కడుపులో పేగులు ఛిద్రమయ్యేలా పొడిచారు. ఆ తర్వాత మహిపాల్‌పూర్‌ ఫ్లైఓవర్‌ దగ్గర కదులుతున్న బస్సులో నుంచే ఇద్దరినీ కిందకు తోసేసి పారిపోయారు.

కాసేపటి తర్వాత అటువైపు వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నిర్భయను, తీవ్ర గాయాలతో పడివున్న ఆమె స్నేహితుడిని స్థానిక సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్‌ 17న నిర్భయ తల్లిదండ్రులు వసంత్‌విహార్‌ పోలీస్‌స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

2016, డిసెంబర్‌ 21న స్థానిక మెజిస్ట్రేట్‌, అదేనెల 25న మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నిర్భయ వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. మరోవైపు రోజురోజుకు నిర్భయ ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్‌ 27న ప్రత్యేక విమానంలో సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్‌ 29న నిర్భయ కన్నుమూసింది.

నిర్భయ మరణవార్త తెలియగానే దేశ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిర్భయ రేపిస్టులను ఉరితీయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలోనే 2012, డిసెంబర్‌ 21 నాటికి నిందితులు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్సు డ్రైవర్‌ రామ్‌సింగ్‌, అతని తమ్ముడు ముఖేశ్‌సింగ్‌, పండ్ల వ్యాపారి పవన్‌గుప్తా, జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ వినయ్‌శర్మ, దినసిర కూలీ అక్షయ్‌ ఠాకూర్‌, 17 ఏండ్ల బాలుడు రాజు ఉన్నారు.

2013, జనవరి 3న ఆరుగురు నిందితులపై ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌‌ దాఖలు చేశారు. వారిలో ఒకడు మైనర్‌‌‌‌గా తేల్చారు. నిందితులను రిమాండ్‌లోకి తీసుకుని ఇంటరాగేట్‌ చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 2న ఆరుగురిపై 13 కేసులు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు తీహార్‌ జైలుకు తరలించారు. 2013, మార్చి 11న రామ్‌సింగ్‌ అనే ప్రధాన నిందితుడు తీహార్‌ జైల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు.

2013, ఆగస్టు 31న డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బాల నేరస్థుడైన రాజును నిర్భయ కేసులో దోషిగా తేల్చి మూడేండ్ల జైలుశిక్ష విధించింది. 2013, సెప్టెంబర్‌ 13న ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్‌ కోర్టు మిగతా నలుగురు నిందితులను కూడా దోషులుగా తేల్చి మరణశిక్ష విధించింది. అయితే, ఈ తీర్పును దోషులు ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. కానీ 2014, మార్చి 13న ఢిల్లీ హైకోర్టు సైతం ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థించింది.

మరోవైపు మూడేండ్ల శిక్షాకాలం పూర్తిచేసుకున్నప్పటికీ బాలనేరస్థుడు రాజును విడుదల చేయొద్దంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే, ఈ పిటిషన్‌ను 2015, డిసెంబర్‌ 18న హైకోర్టు తిరస్కరించింది. దీంతో మూడేండ్ల శిక్షాకాలం పూర్తి కాగానే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు జనం మధ్యే జల్సాగా తిరుగుతున్నాడు.

ఇదిలావుంటే, నిర్భయ కేసులో 2016, ఏప్రిల్‌ 3న సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. 2017, మార్చి 27 నాటికి వాదనలు పూర్తికావడంతో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. 2017, మే 5న దోషులకు కింది కోర్టు విధించిన ఉరిశిక్షలకు ఆమోదం తెలుపుతూ సంచలన తీర్పు వెల్లడించింది.

అయితే, సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడైతే వెల్లడయ్యిందో అప్పుడే శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషుల కుట్రలు, కుతంత్రాలకు తెరతీశారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ సాయంతో వారు న్యాయవ్యవస్థలోని లొసుగులను ఏ ఒక్కటీ వదలకుండా వాడుకోవడం మొదలుపెట్టారు. ముందుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ పవన్‌గుప్తా మినహా మిగతా ముగ్గురు దోషులు 2018, జూలై 9న అదే కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వారి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించినా ఆ తర్వాత దోషులకు ఉరిశిక్ష అమలుపై కొంతకాలం ఎలాంటి పురోగతి కనిపించలేదు.

దీంతో దోషులు కూడా చడీచప్పుడు లేకుండా ఉన్నారు. అనంతరం నిర్భయ తల్లిదండ్రులు కేసులో ఎలాంటి కదలిక లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో నిర్భయ కేసులో మరోసారి చలనం వచ్చింది. ఈ నేపథ్యంలోనే 2020, జనవరి 22న ఉదయం 7 గంటలకు దోషులు నలుగురినీ ఒకేసారి ఉరితీయాలంటూ.. జనవరి 7న ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్ జారీచేసింది.

దీంతో దోషులు మరోసారి డ్రామాలకు మొదలుపెట్టారు. ముఖేశ్‌సింగ్‌ అనే దోషి రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నాడు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్న కారణంతో ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జనవరి 17న ముఖేశ్‌సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాడు.

కానీ, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత దోషులకు 14 రోజుల గడువు ఇవ్వాలన్న నిబంధన మేరకు ఢిల్లీ కోర్టు.. 2019, ఫిబ్రవరి 1న దోషులను ఉరితీయాలంటూ జనవరి 17న మరోసారి డెత్‌ వారెంట్‌ జారీచేసింది. దీంతో నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ మరో ఎత్తు వేశాడు. నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు తాను మైనర్‌ను అంటూ దోషి పవన్‌గుప్తా చేత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించాడు. దీంతో రెండోసారి కూడా దోషులకు ఉరిశిక్ష అమలు జరుగలేదు.

ఈ లోగా వినయ్‌శర్మ తన మానసిక పరిస్థితి బాగాలేనందున ఉరిశిక్ష నుంచి మినహాయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. అక్షయ్‌ ఠాకూర్‌ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు. దీంతో కోర్టు 2019, జనవరి 31న దోషుల ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తీర్పుచెప్పింది. ఆ తర్వాత పవన్‌గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయగా, అక్షయ్‌ ఠాకూర్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

దీంతో, 2020, ఫిబ్రవరి 17న ఢిల్లీ కోర్టు మూడోసారి డెత్‌ వారెంట్లు జారీచేసింది. 2020, మార్చి 3న దోషులను ఉరితీయాలని ఆ వారెంట్లలో పేర్కొంది. ఎప్పటిలాగే ఈసారి కూడా దోషులు డ్రామాలకు తెరతీశారు. ఈ సారి పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. అది తిరస్కరణకు గురికావడంతో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా దోషులకు ఉరిశిక్ష అమలు కాలేదు.

ఈ నేపథ్యంలో.. ‘ఇంతకూ నిర్భయ దోషులను ఉరితీస్తారా.. లేదా?’ అనే సందేహాలు అందిరిలో వ్యక్తమయ్యాయి. న్యాయవాది ఏపీ సింగ్‌.. దోషుల హక్కుల పేరుతో రకరకాల పిటిషన్లు వేయిస్తూ న్యాయవ్యవస్థను పరిహసించడంపై న్యాయ నిపుణుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చివరికి పవన్‌గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి కూడా ‘నిప్పుతో చెలగాటం ఆడుతున్నావ్‌’ అంటూ ఏపీ సింగ్‌ను హెచ్చరించారు.

ఆ తర్వాత 2020, మార్చి 4న పవన్‌గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. దోషుల ఉరితీతకు మరోసారి డెత్‌ వారెంట్‌ జారీచేయాలంటూ అదే రోజు ఢిల్లీ ప్రభుత్వం కూడా పటియాలా హౌస్‌ కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో దోషులు నలుగురిని మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ పటియాల హౌస్‌కోర్టు మార్చి 5న నాలుగోసారి డెత్‌ వారెంట్లు జారీచేసింది. ఇప్పుడు కూడా నిర్భయ దోషులు తమ డ్రామాలను కొనసాగించారు.

పవన్‌గుప్తా రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా రెండోసారి రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ కూడా తిరస్కరణకు గురయ్యింది. మరో రెండు రోజుల్లో ఉరిశిక్ష అమలు జరుగుతుందనగా అక్షయ్‌ ఠాకూర్‌ భార్య పునీత హైకోర్టులో డైవర్స్‌ కోసం పిటిషన్‌ వేసింది. మార్చి 19న ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న కోర్టు.. పిటిషనర్‌ హాజరుకాలేదన్న కారణంతో ఎలాంటి తీర్పు వెల్లడించలేదు.

మరోవైపు నిందితుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌.. నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు తాను ఢిల్లీలోనే లేనని, ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే, ఆ పిటిషన్‌ను కూడా మార్చి 19న సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయినా నిర్భయ దోషులు తమ ప్రయత్నాలు ఆపలేదు. ఉరితీసే సమయానికి రెండు గంటల ముందు వరకు కూడా ఉరిశిక్షల అమలుపై స్టే తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

దీంతో ఢిల్లీ హైకోర్టులో గురువారం అర్ధరాత్రి వరకు, సుప్రీంకోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు విచారణ జరిగింది. అర్థరాత్రి ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షల అమలుపై స్టేకు నిరాకరించగానే.. సీన్‌ సుప్రీంకోర్టుకు మారింది. సుప్రీంకోర్టు కూడా తెల్లవారుజామున 3.30 గంటలకు ఉరిశిక్షల అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో దోషులు నలుగురినీ తీహార్‌ జైల్లోని జైల్‌ నెంబర్‌-3లో ఒకేసారి ఉరితీశారు.
ఉరి సందర్భంగా దోషులు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా ఒక్కో దోషికి 12 మంది చొప్పున మొత్తం 48 మంది గార్డులను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే, ఉరికంబం ఎక్కించేముందు దోషుల్లో ఒకడైన వినయశర్మ బోరున విలపించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...