నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష పడిన దోషులు ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని ఒకరి తరువాత ఒకరు క్షమాభిక్ష అని, రివ్యూ పిటిషన్ అని.. పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ.. ఉరి శిక్ష వాయిదా పడేలా చేస్తున్నారు. దీంతో ఇప్పటికే వారికి పలుమార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. ఇక వీరిని మార్చి 20వ తేదీన ఉరి తీయాల్సి ఉండగా, ఈసారి కూడా మరోమారు ఉరిశిక్ష వాయిదా పడేట్లు కనిపిస్తోంది.
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఎప్పటిలా వ్యవహరించినట్లుగానే ఈసారి కూడా కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సారి వారు ఆశ్రయించింది.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని. దోషుల్లో ముగ్గురైన అక్షయ్, పవన్‌గుప్తా, వినయ్ శర్మలు ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ను ఆశ్రయించారు. ఈ మేరకు వారు ఆ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వారి ఉరిశిక్ష మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
మార్చి 20వ తేదీన ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయాల్సి ఉంది. కానీ వారిలో ముగ్గురు అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ శిక్ష వాయిదా పడుతుందని తెలుస్తోంది. వారిని జనవరి 22వ తేదీన ఉరి తీయాల్సి ఉండగా, వారు వేసిన పిటిషన్ల వల్ల ఎప్పటికప్పుడు శిక్ష వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈసారి దోషులు కొత్త మార్గం ఎంచుకున్నారు. ఐసీజేలో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో దోషుల పిటిషన్‌పై ఐసీజే ఎలా తీర్పునిస్తుందో చూడాలి..!