యంగ్ హీరో నితిన్, కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ వారసుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు, సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎలాంటి కట్స్ చెప్పలేదట. వెంకీ కుడుముల అంత క్లీన్ అండ్ నీట్‌గా ఈ సినిమాను తెరకెక్కించారని అంటున్నారు. అయితే మహాభారతానికి మూల పురుషుడు, ఆ జన్మ బ్రహ్మచర్యం పాటించిన భీష్ముడి పేరుతో సినిమా రూపొందించడంపై బీజేపీ ధార్మిక సెల్ నేతలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు.
భీష్ముడి పేరుతో సినిమా విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. సోమవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎఎస్‌ఎ్‌సలో ధార్మిక సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ, ప్రధాన కార్యదర్శి రత్నాకరం రాము, కార్యవర్గ సభ్యులు వంగల రామకృష్ణ, భీమ్‌సేన్‌మూర్తి తదితరులు మాట్లాడారు. భీష్మ సినిమా టైటిల్‌ను వెంటనే మార్చాలని, ఇందులో హీరోను లవర్ బాయ్‌గా చూపిస్తూ ఆ పాత్రకు భీష్మ పేరు పెట్టడం బాధాకరమన్నారు. టైటిల్ మార్చని పక్షంలో ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరి ఈ వివాదం నుంచి భీష్మ చిత్రం ఎలా బయటపడుతుంతో చూడాలి.