పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో నీతి ఆయోగ్ స్పీడ్ పెంచింది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ఆస్తుల ద్వారా నగదు సేకరణపై రాష్ట్రాలకు నీతి ఆయోగ్ వివిధ సూచనలు చేసింది. నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నీతి ఆయోగ్ కొనసాగించనుంది. నీతి ఆయోగ్ సూచన మేరకు నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ కు నోడల్ ఏజెన్సీగా ఇన్ క్యాప్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో నీతి ఆయోగ్ సూచనలు కీలకంగా మారారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ఆస్తుల ద్వారా నిధుల సేకరణ వంటి అంశాలపై నేషనల్ మోనిటైజేషన్ పైప్ లైన్ అధ్యయనం చేయనున్నారు. ఏయే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేయవచ్చనే అంశంపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు నీతి ఆయోగ్ సూచలు చేసింది. జాతీయ ఆస్తుల నుంచి నిధుల సమీకరణ చేసే క్రమంలో ప్రైవేటీకరణ, విలీనం సహా మూసివేత వంటి అంశాలు ఉంటాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.