శాస్త్రీయ ప్రయోగాలకు జయాలే కాని అపజయాలు వుండవు.. నాడు రాజీవ్‌… నేడు మోడీ

-

ప్రధాన మంత్రి మోడీ అన్నట్టు ‘ఇది అధైర్య పడే సమయం కాదు’. చంద్రయాన్ – 2 ప్రయోగం తుట్టతుది ఘడియలో తలెత్తిన లోపం అపజయం ఎంతమాత్రం కాదు, అంతరాయం మాత్రమే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆయా ప్రభుత్వాలు అందిస్తున్న సహాయ సహకారాలు, అడ్డంకులు ఎదురయినప్పుడు భుజం తట్టి నేనున్నాను అని ఇస్తున్న భరోసాలు అణు పరీక్షల విషయంలో, అంతరిక్ష పరిశోధనల విషయంలో భారత శాత్రవేత్తలు సాగిస్తున్న మొక్కవోని కృషికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నది నిర్వివాదాంశం. ఈ తెల్లవారుఝామున ప్రయోగాన్ని వీక్షించడానికి స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శాస్త్రవేత్తలకు మరోమారు ఇచ్చిన భరోసా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.


ఈ నేపధ్యంలో ఇలాంటిదే ఓ పాత జ్ఞాపకం మ‌నం గుర్తు తెచ్చుకోవాలి. 1987, మార్చి నెల
ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు  రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనులయివున్నారు. భారత దేశానికి గర్వకారణం కాగల ఈ ప్రయోగాన్ని కళ్ళారా చూడడానికి సుమారు పదివేలమంది ప్రేక్షకుల గేలరీలో వేచి వున్నారు.

అనుకున్న సమయానికి రాకెట్ ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ రాకెట్ గగనంలోకి దూసుకుపోయింది. రాకెట్ పైకి లేస్తుండగానే వారందరూ ఒకరికొకరు అభివాదాలు తెలుపుకుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగా వున్నసమయంలో జరగరానిది జరిగిపోయింది. ప్రయోగించి నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖాతంలో కూలిపోయింది. ఒక్క లిప్తపాటు భయంకర నిశ్శబ్దం. అందరి మొహాల్లో ఆనందం తప్పుకుంది. విషాదం అలముకుంది. రాజీవ్ గాంధి అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో అధికారులను, సిబ్బందిని అనునయించారు.

ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాలలో విజయాలే తప్ప, అపజయాలు ఉండవన్నారు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాలని ధైర్యం చెప్పారు. అలా పోగుపడిన ధైర్యమే ఈనాడు ఇస్రో బృందాన్ని అనేక ప్రపంచ రికార్డులు  సొంతం చేసుకునేలా చేసింది. అక్షరాలా నూట నాలుగు ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపేలా చేయగలిగింది. నిజమే. అంతకు ముందు తెలియని విషయాలను కనుగొనేముందు ఎన్ని అపజయాలు ఎదురయినా శాస్త్రవేత్తలు  వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఈనాడు ప్రపంచానికి ఇన్ని శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు అందుతున్నాయి. మొదటి వైఫల్యానికే చతికిల పడివుంటే ఇప్పుడూ అక్కడే వుండేవాళ్ళం.

Read more RELATED
Recommended to you

Latest news