పర్యావరణాన్ని ప్లాస్టిక్ ఎంతో దెబ్బ తీస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కల్పిస్తున్నాయి. అయితే.. ఏపీలో ప్లాస్టిక్ వాడకం తగ్గించే దిశగా దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులకు దేవదాయ శాఖ స్వస్తి పలకనుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ శాఖ. అంతేకాకుండా.. ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలను నిషేధించనున్నట్లు.. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి పూర్తిగా నిషేదిస్తునట్లు అధికారులు పేర్కొన్నారు.
ఏడాదికి రూ.25 లక్షలు, ఆపైన ఆదాయం ఉండే ఆలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీగా వర్గీకరించింది. తొలి దశలో జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా వర్గీకరించిన ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించనున్నట్లు అధికారులు తెలిపారు. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నాయి. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు వస్తాయి.