కొందరు కావాలని తనకు, రోహిత్ శర్మకు మధ్య గొడవలు పెట్టేందుకు యత్నిస్తున్నారని, నకిలీ వార్తలను సృష్టించడం తప్ప అలాంటి వారికి మరొక పని ఉండదని కోహ్లి అన్నాడు. జట్టులో అందరూ ఎంతో స్నేహంగా ఉంటున్నారని, కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రే కావాలని కోహ్లి అన్నాడు.
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్.. న్యూజిలాండ్ చేతిలో దారుణ ఓటమి పాలైన తరువాత.. టీమిండియా రెండు వర్గాలుగా విడిపోయిందని వార్తలు వచ్చాయి. అలాగే జట్టు కెప్టెన్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ విభేదాలు వచ్చాయని, వారిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని కూడా జోరుగా ప్రచారం సాగింది. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని.. తమ పట్ల వచ్చిన వార్తలన్నీ అబద్దాలేనని కోహ్లి వివరణ ఇచ్చాడు.
ఆగస్టు 3వ తేదీ నుంచి టీమిండియా వెస్టిండీస్ టూర్ ప్రారంభం అవుతున్న విషయం విదితమే. అందుకు గాను భారత జట్టు సోమవారం రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి వెస్టిండీస్‌కు బయల్దేరింది. అంతకు ముందు జట్టు కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోహ్లి తనకు, రోహిత్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చేశాడు. గతంలో తాము ఎలా ఉన్నామో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామన్నాడు.
కొందరు కావాలని తనకు, రోహిత్ శర్మకు మధ్య గొడవలు పెట్టేందుకు యత్నిస్తున్నారని, నకిలీ వార్తలను సృష్టించడం తప్ప అలాంటి వారికి మరొక పని ఉండదని కోహ్లి అన్నాడు. జట్టులో అందరూ ఎంతో స్నేహంగా ఉంటున్నారని, కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రే కావాలని కోహ్లి అన్నాడు. ఇక మిడిలార్డర్‌లో మంచి బ్యాట్స్‌మన్ కోసం చూస్తున్నామన్నాడు. తనకు, రోహిత్ శర్మకు మధ్య విభేదాలు ఉన్నాయనే మాట పూర్తిగా అవాస్తవమని కూడా కోహ్లి కొట్టి పారేశాడు. తాను ఎవర్నైనా ఇష్ట పడకపోతే ఆ వ్యక్తి ఎదురుపడినప్పుడు తన ముఖంలోనే ఆ భావాలు కనిపిస్తాయని కూడా కోహ్లి స్పష్టం చేశాడు.
రోహిత్‌ను తాను ప్రతిసారీ పొగుడుతూనే ఉంటానని కోహ్లి అన్నాడు. అతను ఒక మంచి ఆటగాడని, కానీ తమ ఇద్దరి మధ్య కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయాడు. తమ వ్యక్తిగత జీవితాలను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను, రోహిత్ గత 10, 12 ఏళ్లుగా కలిసి క్రికెట్ ఆడుతున్నామని, తమ మధ్య విభేదాలు అన్న మాటే ఇప్పటి వరకు రాలేదని కోహ్లి తెలిపాడు. ఇక వెస్టిండీస్‌తో పర్యటనకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అక్కడ ఆడడాన్ని ఎవరైనా ఆస్వాదిస్తారని కోహ్లి తెలిపాడు. ఈ క్రమంలోనే విండీస్ పర్యటనలో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుందని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా రోహిత్‌కు, తనకు మధ్య విభేదాలున్నాయన్న వార్తలపై ఎట్టకేలకు కోహ్లి స్పందించడంతో ఇక ఈ వార్తలకు ఇప్పటితో తెరపడినట్లేనని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు..!