మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయులకు వేరే ప్రత్యామ్నాయం లేకే మోడీకి మళ్లీ జైకొట్టారని నోబెల్ బహుమతి పొందిన ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో సరైన నాయకుడు కనిపించకపోవడంతోనే ప్రజలు ఆయనకు ఓట్లేశారని విశ్లేషించారు. జనం మళ్లీ గెలిపించారంటే.. ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలకూ జనం ఓకే చెప్పినట్టు కాదని అభిజిత్ అన్నారు.
ఏ ప్రభుత్వమైనా ఓ వంద పనులు చేస్తుంది. వాటిన్నింటిపైనా ప్రజలు ఓట్లేయాలి. వారు చాలా వరకు మోదీకి ఓటేశారు. ప్రతిపక్షంలో ఓట్లేయదగ్గ నాయకుడు లేడని ప్రజలు భావించారు. మోదీకి నిజంగానే ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. అయితే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయానికీ ప్రజలు ఓట్లేశారని నేను అనుకోవడం లేదు…అన్నారు అభిజిత్.
ఈ పథకానికి మోదీకి నేను ఓటేయాలి.. ఆ పథకానికి వేయకూడదు అన్న చాయిస్ ప్రజలకు లేదు. వారికి ఉన్నది ఒక్కటే చాయిస్.. మోదీనా.. కాదా? అంటూ ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ తెలిపారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని అభిజిత్ అభిప్రాయపడ్డారు.
‘ప్రస్తుతం దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం. ప్రజాస్వామ్యానికి ఇది మేలు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ బాధ్యతను తీసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రజలు భావిస్తున్నట్లు నేను అనుకోవడం లేదు. ఆ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు లేడు. అధ్యక్షుడు ఎవరైనా, అతడికి బలమైన అధికారాలు ఇవ్వాలి. వారు కోరుకున్నట్లుగా పార్టీని నడిపించే స్వేచ్ఛనివ్వాలి’ అని అభిజిత్ సూచించారు.
పేదరిక నిర్మూలనకు విశిష్ఠ పరిశోధనలు జరిపిన అభిజిత్‌కు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. అభిజిత్‌తోపాటు ఆయన భార్య డ్యుఫ్లో, మైఖెల్ క్రేమర్ కూడా నోబెల్‌కు ఎంపికయ్యారు. 2014 ఎన్నికల సమయంలో అభిజతి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి న్యాయ్ పథకాన్ని సూచించారు. పేదరికాన్ని పారద్రోలే ప్రతిపాదనలు చేసిన ఆర్థిక వేత్తగా అభిజిత్ కు పేరుంది.