దుబ్బాక ఉప ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. ఈ ఎన్నిక కోసం మొత్తం 46 మంది అభ్యర్థులు 103 నామినేషన్స్ దాఖలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక నామినేషన్ కి నేటితో గడువు ముగియనుంది. రేపు నామినేషన్ ల పరిశీలన ఉంటుంది. అలానే ఈ నెల 19 వరుకు నామినేషన్లు ఉప సంహరణకు అవకాశం ఇస్తారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 22 నెలల తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
గెలిచి సత్తా చూపాలని అధికార, విపక్ష నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. గత అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 1,90,483 మంది ఓటర్లు ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్ధి రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి ఉప ఎన్నికల్లోనూ ఇదే ఊపులో ప్రచారం నిర్వహించి లక్ష ఓట్ల మెజారిటీ సాధించి ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బతీయాలని టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.