దేశంలో ఎమర్జెన్సీ విధించి 5 దశాబ్దాలు పూర్తవుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని అనేకసార్లు అణిచివేసిందని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ పార్టీకి యువరాజు అని ఎద్దేవా చేశారు. ఆయన అమ్మమ్మ ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించారని ,అతని తండ్రి రాజీవ్ గాంధీ 1985, జూలై 23న పార్లమెంట్ సాక్షిగా ‘ఎమర్జెన్సీ విధించడం తప్పేమీ కాదని ‘ చెప్పినట్టు రాహుల్ గాంధీ మర్చిపోయారని అన్నారు.
‘ఒక కుటుంబాన్ని అధికారంలో కొనసాగించేందుకు కాంగ్రెస్ మన రాజ్యాంగ స్పూర్తిని అనేకసార్లు తుంగలో తొక్కింది అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ భారత ప్రజలపై క్రూరమైన దౌర్జన్యాలను సృష్టించిందని అమిత్ షా ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ ఆనాడు.. ఎమర్జెన్సీ అవసరమని భావించి అమలు చేయని పక్షంలో దేశ ప్రధాని ఎవరైనా ఆ పదవిలో ఉండేందుకు తగినవారు కాదని ఆయన అన్నారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి కుటుంబం, అధికారం తప్పించి మరేదీ ప్రియమైనది కాదని స్పష్టమవుతోందని అమిత్ షా విమర్శించారు.