అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్టు.. ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర స్పందించారు. గర్భగుడిలోకి పైకప్పు నుంచి వాటర్ లీకేజీ నిజమేనని అంగీకరించిన ఆయన..దీనికి డిజైన్ సమస్యలు కారణం కాదని తెలిపారు. ”ప్రస్తుతం నేను అయోధ్యలోనే ఉన్నాను. మొదటి అంతస్తు నుంచి వర్షం నీరు కారడాన్ని చూశాను. గురుమండపం నుంచి ఆకాశం కనిపిస్తుంది. శిఖర నిర్మాణం పూర్తయితే అది కవర్ అవుతుంది అని తెలిపారు. ప్రస్తుతం మొదటి అంతస్తు నిర్మాణ పనులు ఒకసారి పూర్తయితే అక్కడి పైపులు అన్ని మూసివేస్తాం. అలాగే గర్భగుడిలో ఎలాంటి డ్రైనేజీ తరహా నిర్మాణం లేదు” అని ఆయన తెలిపారు. మొత్తం ఆలయ నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని అన్నారు.
శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య బయటపడిందని, నీరు సరిగ్గా బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతోందని సత్యేంద్రదాస్ తెలిపారు.ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవని.. ఈ సమస్యపై ఆలయ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.