హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు.. తదితర ప్రదేశాల్లో తింటానికి, తాగడానికి వెళితే.. అక్కడ ఉండే కిచెన్లలోకి కస్టమర్లకు అనుమతి ఉండదు. కిచెన్ల డోర్లపై నో ఎంట్రీ అనో, నో అడ్మిషన్.. అనో బోర్డులు పెడతారు. అయితే ఇకపై గుజరాత్‌లో మాత్రం అలా కాదు.
మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఏ దేశంలోనైనా సరే.. హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు.. తదితర ప్రదేశాల్లో తింటానికి, తాగడానికి వెళితే.. అక్కడ ఉండే కిచెన్లలోకి కస్టమర్లకు అనుమతి ఉండదు. కిచెన్ల డోర్లపై నో ఎంట్రీ అనో, నో అడ్మిషన్.. అనో బోర్డులు పెడతారు. అయితే ఇకపై గుజరాత్‌లో మాత్రం అలా కాదు. కస్టమర్లు హోటల్స్, రెస్టారెంట్లలోని కిచెన్ల లోపలికి వెళ్లవచ్చు. అక్కడి పరిశుభ్రతను పరిశీలించవచ్చు. గుజరాత్ ప్రభుత్వం తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
గుజరాత్‌లోని ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీసీఏ) అక్కడి హోటల్స్, రెస్టారెంట్లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై అక్కడి హోటల్స్, రెస్టారెంట్లలో కిచెన్ రూంలకు ఉండే నో ఎంట్రీ, నో అడ్మిషన్.. బోర్డులను తొలగించాలని, ఆ కిచెన్లలోకి కస్టమర్లను కచ్చితంగా అనుమతించాలని, అలాగే కిచెన్లకు బయటి నుంచి కస్టమర్లకు కనిపించేలా గ్లాస్ గోడలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు. మరో 2 వారాల్లో ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని హుకుం జారీ చేశారు. ఈ నియమ నిబంధనలను పాటించని హోటల్స్ లేదా రెస్టారెంట్లపై రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తామని గుజరాత్ సీఎం విజయ్ రుపాని హెచ్చరించారు.
కాగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై అక్కడి హోటల్స్, రెస్టారెంట్లలోకి కస్టమర్లు వెళ్లి అక్కడి వాతావరణం ఎలా ఉందో స్వయంగా పరిశీలించవచ్చు. ఆహారాన్ని ఎలా వండుతున్నారు ? పరిశుభ్రత పాటిస్తున్నారా ? లేదా ? అన్న వివరాలను వారు స్వయంగా చూసి తెలుసుకోవచ్చు. దీంతో వారికి సదరు హోటల్ లేదా రెస్టారెంట్‌పై నమ్మకం పెరుగుతుంది. అయితే ఈ నియమ నిబంధనలు తమకు కూడా మేలు చేస్తాయని గుజరాత్ హోటల్స్, రెస్టారెంట్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. మరి ఈ రూల్స్ అక్కడ ఏ మేర మంచి ఫలితాలను ఇస్తాయో చూడాలి..!