ప్రస్తుత తరుణంలో అధిక శాతం మంది మొబైల్ ఫోన్లు, కార్డులు, వాలెట్ల ద్వారా డిజిటల్ పద్ధతిలో పేమెంట్లు చేస్తున్నారు. అయితే ఇందుకు గాను కచ్చితంగా ఇంటర్నెట్ అవసరం అవుతుంది. కానీ ఇంటర్నెట్ లేని సమయంలో కూడా ఇవే మాధ్యమాలను ఉపయోగించి పేమెంట్లు చేసేలా ఆర్‌బీఐ ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆర్‌బీఐ ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్డులు, వాలెట్లు, మొబైల్ ఫోన్ల ద్వారా ఆఫ్‌లైన్‌లోనూ వినియోగదారులు పేమెంట్లు చేయవచ్చు. అదెలాగంటే…
వినియోగదారులు తమ కార్డులు లేదా వాలెట్లు లేదా మొబైల్ డివైస్‌లలో పేమెంట్ సమాచారాన్ని మర్చంట్‌కు ఇస్తారు. మర్చంట్ ఆ డేటాను తన వద్ద స్టోర్ చేసుకుంటాడు. ఈ క్రమంలో మర్చంట్ ఆ పేమెంట్ మొత్తానికి గాను తరువాత ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ప్రాసెస్ చేస్తాడు. దీంతో రశీదు వస్తుంది. ఆ రశీదును వినియోగదారుడు తరువాత తీసుకోవచ్చు. అలాగే లావాదేవీ పూర్తయిన వెంటనే వినియోగదారుడి ఫోన్‌కు ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఇలా ఈ విధానంలో పేమెంట్లు చేయవచ్చు. దీని వల్ల ఇంటర్నెట్ లేకపోయినా పేమెంట్లు చేసుకునేందుకు వీలు కలుగుతుంది.
ఇక ఈ ప్రాజెక్టుకు మార్చి 31, 2021ని డెడ్‌లైన్‌గా విధించారు. ఈ విధానానికి వినియోగదారులు, మర్చంట్ల నుంచి వచ్చే స్పందన చూశాక.. అవసరం అనుకుంటే దీన్ని కొనసాగిస్తారు. లేదంటే రద్దు చేస్తారు. ఈ విధానంలో పేమెంట్లు చేస్తే వినియోగదారుడి పేమెంట్ సమాచారాన్ని రక్షించే బాధ్యత మర్చంట్‌కు ఉంటుంది. దాన్ని దుర్వినియోగం చేస్తే మర్చంట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇక ఈ విధానం ద్వారా పేమెంట్లు చేసేటప్పుడు అదనపు ఆథెంటికేషన్ ఏమీ అవసరం ఉండదు. అలాగే కనీసం రూ.200 నుంచి రూ.2వేలకు మాత్రమే ఈ విధానంలో పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.