సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ కేసును సీబీఐచే దర్యాప్తు చేయించాలని బీహార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బీహార్ సీఎం నితీష్ కుమార్ కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరగా.. అందుకే కేంద్రం బుధవారం అంగీకరించింది. దీంతో కేంద్రం నుంచి ఆదేశాలు పొందిన సీబీఐ ఆ కేసును దర్యాప్తు చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు సీబీఐ అధికారులు బీహార్ పోలీసుల నుంచి ఈ కేసుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
సీబీఐ ఎస్పీ నుపుర్ ప్రసాద్ నేతృత్వంలో గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారులు డీఐజీ గగన్‌దీప్ గంభీర్, జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్‌ల పర్యవేక్షణలో సీబీఐ సుశాంత్ కేసును దర్యాప్తు చేయనుంది. ఈ మేరకు సీబీఐ కొత్తగా కేసును రిజిస్టర్ చేసింది. అలాగే సీఆర్‌పీసీ సెక్షన్ 154 ప్రకారం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ను కూడా నమోదు చేసింది. ఇందుకు గాను అవసరమైన సమాచారాన్ని సీబీఐ బీహార్ పోలీసుల నుంచి సేకరించింది. దీంతో సీబీఐ సుశాంత్ కేసును అధికారికంగా దర్యాప్తు చేయడం ప్రారంభించింది.
కాగా సుశాంత్ కేసు విషయమై సీబీఐ మొత్తం 20 పేజీలతో కూడా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. అందులో నటి రియా చక్రవర్తిని ఎ1గా చేర్చింది. అలాగే ఇంద్రజిత్ చక్రవర్తి(రియా తండ్రి)ని ఎ2గా, సంధ్య చక్రవర్తి(రియా తల్లి)ని ఎ3గా, శౌవిక్ చక్రవర్తి(రియా సోదరుడు)ని ఎ4గా, శామ్యూల్ మిరాండా(సుశాంత్ ఇంటి మేనేజర్)ను ఎ5గా, శృతి మోదీ(రియా మాజీ మేనేజర్)ని ఎ6గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇక మొత్తం 8 సెక్షన్ల కింద కేసు సీబీఐ కేసు నమోదు చేసింది. 120బి, 306, 341, 342, 380, 406, 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
ఇక ఇప్పటికే రియా చక్రవర్తితోపాటు ఆమె వ్యవహారాలు చూసే శామ్యూల్ మిరాండాకు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. సుశాంత్ ఖాతాల్లో ఉండాల్సిన రూ.15 కోట్ల నగదు విషయంలో మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ వారికి సమన్లు జారీ చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు సుశాంత్ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను 3 రోజుల్లోగా సమర్పించాలని అటు మహారాష్ట్ర, ఇటు బీహార్ పోలీసులను ఆదేశించింది.