రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బంగారం రుణాలను పొందేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కస్టమర్లు తాము బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద తాకట్టు పెట్టే బంగారానికి గాను ఎక్కువ మొత్తంలో రుణం పొందవచ్చు. ఈ మేరకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో జనాలకు ఆర్థిక సమస్యలు వస్తున్నందునే తాము ఈ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్‌బీఐ తెలియజేసింది.
ఇప్పటి వరకు బంగారం విలువలో 75 శాతం వరకు రుణాన్ని ఇచ్చే వారు. అయితే ఇకపై వినియోగదారులు 90 శాతం వరకు రుణం పొందవచ్చు. ఇక ఈ సదుపాయం వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. అయితే 90 శాతం రుణం తీసుకుంటే వడ్డీ కూడా ఎక్కువ అవుతుంది.
ఆర్‌బీఐ 3 రోజుల పాటు జరగనున్న తన ఎంపీసీ మీటింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బంగారం రుణాలకు గాను ఆర్‌బీఐ లోన్ టు వాల్యూ (ఎల్‌టీవీ) రేషియోను పెంచింది. దీని వల్ల ఇకపై కస్టమర్లు తమ బంగారం విలువలో 75 శాతానికి బదులుగా 90 శాతం వరకు రుణం పొందవచ్చు. ఉదాహరణకు.. రూ.5 లక్షల విలువైన బంగారానికి గతంలో 3.75 లక్షల రుణం వచ్చేది. కానీ ఇప్పుడు రూ.4.50 లక్షల రుణం పొందవచ్చు.