భారతీయులకు బంగారం అంటే పండగే. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో జనాలు ఆభరణాలు కాకుండా బంగారాన్ని డిజిటల్ రూపంలో కొంటూ దానిపై పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం రేటు ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో జనాలు ఆ పని చేస్తున్నారు. అయితే ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ ఫోన్‌పే ఇప్పుడు మీకు సదవకాశాన్ని అందిస్తోంది. అదేమిటంటే.. కేవలం రూ.1 తోనే బంగారంపై మీరు అందుబాటులో పెట్టుబడి పెట్టవచ్చు. అవును.. ఇది నిజమే.
ఫోన్‌పే లో బంగారాన్ని డిజిటల్ రూపంలో కొంటూ దానిపై పెట్టుబడి పెట్టవచ్చు. బంగారం మీకు అవసరం అయినప్పుడు కోరితే భౌతిక రూపంలోనూ దాన్ని మీకు అందిస్తారు. ఫోన్‌పేలో మై మనీ అనే ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ కింద గోల్డ్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ఎంచుకుని అందులో సేఫ్ గోల్డ్ లేదా ఎంఎంటీసీ-పీఏఎంపీ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. అందులో మీకు కావల్సిన పరిమాణాన్ని ఎంటర్ చేయాలి. బంగారాన్ని గ్రాముల్లో కొనదలిస్తే ఆ నంబర్ లేదా రూపాయల్లో కొనదలిస్తే ఆ నంబర్.. రెండింటిలో ఏ నంబర్‌ను అయినా అక్కడ వేయవచ్చు. అనంతరం ప్రొసీడ్ టు పేమెంట్ బటన్‌పై క్లిక్ చేసి పేమెంట్ చేయాలి. దీంతో బంగారం మీ డిజిటల్ ఖాతాలో సేవ్ అవుతుంది. అలా బంగారాన్ని ఎప్పటికప్పుడు కొనవచ్చు. దానిపై పెట్టుబడి పెట్టవచ్చు.
ఇక ఈ విధంగా బంగారం కొన్నా.. అమ్మినా.. రియల్‌టైంలో బంగారం ధరల్లో మార్పు ఉంటుంది కనుక ట్రాన్సాక్షన్ జరిగే సమయంలో ఉన్న రేటును ఇస్తారు. అయితే బంగారాన్ని ఒకే రోజు కొని అమ్మడం మాత్రం కుదరదు. ఇక బంగారాన్ని యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, వాలెట్‌లలో ఏ పేమెంట్ విధానాన్ని అయినా ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు.
కాగా భారత్‌పే యాప్, పేటీఎంలలోనూ ఇప్పటికే ఇలాంటి సదుపాయాన్ని అందిస్తున్నారు. కనుక బంగారంపై ఎంత తక్కువ మొత్తంలో అయినా ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఈ విధానం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.