పార్లమెంట్ ఆవరణలో ఎంపీల 50 గంటల నిరాహార దీక్ష

-

సస్పెన్షన్లకు నిరసనగా 20 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంటు ఆవరణలోనే 50 గంటల రిలే దీక్షకు దిగారు. రాత్రుళ్లు కూడా అక్కడి నుంచి కదలలేదు. వారికి అవసరమైన ఆహారం, ఇతర ఏర్పాట్లను ప్రతిపక్షాలు చూశాయి. 50 గంటలపాటు ఇలానే ఆందోళన కొనసాగిస్తామని తృణమూల్‌ ఎంపీ డోలాసేన్‌ స్పష్టం చేశారు. ఎన్సీపీ, జేఎంఎంల నుంచి ఎవరూ సస్పెండ్‌ కాకపోయినా ఆ రెండు పార్టీలు కూడా నిరసనలో పాల్గొన్నాయి.

నిరసన శిబిరంలో ఉన్నవారికోసం ఉదయం ఇడ్లీ-సాంబార్‌ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సమకూర్చగా మధ్యాహ్నం పెరుగన్నాన్ని అదే పార్టీ ఏర్పాటు చేసింది. రాత్రికి రోటీ, పన్నీర్‌, చికెన్‌ తండూరీని తృణమూల్‌ సమకూర్చింది. గురువారం అల్పాహారాన్ని డీఎంకే, మధ్యాహ్న భోజనాన్ని తెరాస, రాత్రి భోజనాన్ని ఆప్‌ పంపిస్తాయి.

నిరసనలో కూర్చున్నవారికి మద్దతుగా వంతుల వారీగా కొంతమంది విపక్ష సభ్యులు శిబిరం వద్దకు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. దీనికోసం వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ టెంట్‌ వేయడానికి పార్లమెంటు వర్గాలు అనుమతించలేదు. ఆరుబయటే వారంతా విశ్రమించారు.

 

విపక్షాలకు చెందిన కొంతమంది సభ్యుల సస్పెన్షన్‌పై బుధవారం.. పార్లమెంటు ఉభయసభల కార్యకలాపాల్లో ప్రతిష్టంభన నెలకొంది. అనుచిత ప్రవర్తనకు గానూ విచారం వ్యక్తం చేసినట్లయితే సస్పెన్షన్‌ ఎత్తివేతను పరిశీలిస్తామని ప్రభుత్వం తెలిపింది. సోమవారం లోక్‌సభలో నలుగురు, మంగళవారం రాజ్యసభలో 19 మంది సభ్యులు సస్పెండ్‌ కాగా బుధవారం రాజ్యసభలో ఆప్‌ సభ్యుడు సంజయ్‌సింగ్‌పైనా వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Latest news