అన్నాడీఎంకేలో శశికళ రీ ఎంట్రీ కలకలం

-

అసెంబ్లీ ఎన్నికల వేళ అరవనాట రాజకీయాలు వేడెక్కాయ్. జైలు విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళరాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. సుపరిపాలన కోసం అన్నాడీఎంకేను మళ్లీ గెలిపించాలని ప్రజలకు లేఖ రాశారు. ఆమె నిర్ణయంతో అభిమానులు ఒక్కసారిగా నిరాశలో మునిగిపోయారు. ఇంతలోనే జయలలిత నమ్మినబంటు డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం చేసిన వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో చిన్నమ్మ రీ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ మొదలైంది.

జయ మరణానంతరం శశికళ ఆశీస్సులతో సీఎం పీఠమెక్కారు ఓపీఎస్‌. ఆ తరువాత ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో శశికళ పైనే తిరుగుబాటు చేశారు. శశికళ జైలుకెళ్లాక ముఖ్యమంత్రి పళనిస్వామితో రాయబారాలు సాగించి, ఎట్టకేలకు ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన శశికళ అన్నాడీఎంకేను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు..ఆ తరువాత రాజకీయాలకు గుడ్‌ బై చెబుతున్నట్లు ప్రకటించారు.

రాజకీయాలకు గుడ్ బై చెబుతూ అన్నాడీఎంకేను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు శశికళ. ఈ నేపథ్యంలోనే పన్నీరుసెల్వం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. చిన్నమ్మ పార్టీలోకి వస్తే తనకెలాంటి ఇబ్బంది లేదన్న ఆయన జయతో మూడు దశాబ్దాలకు పైగా సావాసం చేశారని ఓ తమిళ చానెల్‌కు ఇంటర్య్వూలో చెప్పారు. అన్నాడీఎంకేలోకి రావాలన్న ఆమె కోరికను మానవతా దృక్పథంతో చూడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆమె చేరిక విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామంటూ కొత్త చర్చకు తెరలేపారు.

ఓపీఎస్‌ చేసిన వ్యాఖ్యలు అటు ప్రత్యర్థుల్లో, ఇటు పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలు ముగిశాక శశికళ అన్నాడీఎంకేలో చేరడం ఖాయమైందని, ముందస్తు వ్యూహంలో భాగంగానే ఓపీఎస్‌ ఈ వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నమ్మ పోయెస్‌గార్డెన్‌కు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడున్న వినాయకుడి ఆలయంలో శశికళ పూజలు చేసినట్లు సమాచారం. అయితే అన్నాడీఎంకే ఓట్లు చీలకుండా ఉండేందుకే పన్నీరుసెల్వం ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news