షాకింగ్‌.. 8 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్‌..!

-

దేశంలో అత్యధిక సంఖ్యలో జనాలు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ నంబర్‌ వన్ స్థానంలో ఉంది. అయితే అది పేరుకే హిందీ రాష్ట్రం. కానీ అక్కడి విద్యార్థులకు హిందీ అంటే అసలు బొత్తిగా ఇష్టం లేదు. ఆ విషయం ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. ఇక తాజాగా వెలువడిన యూపీ బోర్డు పరీక్షల ఫలితాల్లో మరోసారి ఇది రుజువైంది.

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 10, 12 తరగతులకు చెందిన విద్యార్థుల బోర్డు పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఆ పరీక్షల్లో ఆ రెండు తరగతులకు చెందిన మొత్తం 8 లక్షల మంది విద్యార్థులు హిందీ పరీక్షలో ఫెయిల్‌ అయ్యారు. 12వ తరగతికి చెందిన 2.70 లక్షల మంది, 10వ తరగతికి చెందిన 5.28 లక్షల మంది విద్యార్థులు హిందీలో ఫెయిల్‌ అయ్యారు. ఇక ఆ రెండు తరగతులకు గాను మరో 2.39 లక్షల మంది విద్యార్థులు అసలు హిందీ పరీక్షనే ఉద్దేశ్యపూర్వకంగానే రాయలేదు. దీన్ని బట్టి చూస్తే వారు హిందీని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో ఇట్టే మనకు అర్థమవుతుంది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూపీలో 10, 12 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్‌ నిర్వహించగా మొత్తం కలిపి 59.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 30 లక్షల మంది 10వ తరగతి పరీక్షలు రాయగా, 25 లక్షల మంది 12వ తరగతి పరీక్షలు రాశారు.

అయితే ఈ ఏడాది ఈ రెండు తరగతులకు చెందిన వారు హిందీలో ఫెయిల్‌ అయిన సంఖ్య గతేడాది కన్నా 2 లక్షలు తక్కువగా ఉండడం గమనార్హం. గతేడాది ఈ తరగతుల వారు మొత్తం 10 లక్షల మంది హిందీలో ఫెయిలైతే ఈ సారి ఆ సంఖ్య 2 లక్షలు తగ్గి 8 లక్షలకు చేరుకుంది. ఇక 2018లో ఈ రెండు తరగతులకు చెందిన వారు 11 లక్షల మంది హిందీలో ఫెయిలయ్యారు. ఈ క్రమంలో ఏటా హిందీలో ఫెయిల్‌ అవుతున్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ హిందీ అధికంగా మాట్లాడే రాష్ట్రంలో ఇలాంటి ఫలితాలు రావడం విడ్డూరంగా ఉందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇక ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయినవారు త్వరలో జరగబోయే సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version