జమ్ముకశ్మీర్ జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా(57) దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి డీజీని జమ్ము శివారు ప్రాంతమైన ఉదయ్వాలాలోని ఆయన ఇంట్లోనే ఎవరో గొంతు కోసి, హత్య చేశారు. ఆ గదిలోనే డీజీ మృతదేహాన్ని దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అనంతరం హేమంత్ ఇంటి పని మనిషి జసీర్ కనిపించకుండా పోగా.. అతడే ప్రధాన అనుమానితుడని పోలీసులు భావించారు.
కానీ ఇప్పుడు ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డీజీ హేమంత్ కుమార్ లోహియా హత్య కేసులో ఇంటి పని మనిషి జసీర్పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఓ కీలక ప్రకటన వెలువడింది. ఈ హత్య తమ పనేనని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్-పీఏఎఫ్ఎఫ్ అనే సంస్థ ప్రకటించుకుంది.
“ప్రత్యేకంగా నిఘా పెట్టి మా స్పెషల్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఇలాంటి హైప్రొఫైల్ ఆపరేషన్లకు ఇది ప్రారంభం మాత్రమే. మేము తలచుకుంటే ఎక్కడైనా, ఎప్పుడైనా కచ్చితత్వంతో దాడి చేయగలమని హిందుత్వ పాలకులను, వారి భాగస్వాములను హెచ్చరించేందుకే ఇదంతా. కట్టుదిట్టమైన భద్రత మధ్య కశ్మీర్ పర్యటనకు వస్తున్న హోం మంత్రికి ఇదొక చిరు కానుక. మున్ముందు ఇలాంటి ఆపరేషన్లు మరిన్ని చేపడతాం” అని ఆ ప్రకటనలో పేర్కొంది పీఏఎఫ్ఎఫ్.