పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో పేలుడు సంభవించింది. కరాచీ యూనివర్సిటీ సమీపంలో కారు పేలింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారు. ఇందులో ముగ్గురు చైనా దేశానికి చెందిన వారు ఉన్నారు. ఒక విదేశీయుడు, ఒక రేంజర్స్ అధికారి మరియు ఒక ప్రైవేట్ గార్డుతో సహా ముగ్గురు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. కరాచీ యూనివర్సిటీ కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలోని వ్యాన్‌లో పేలుడు సంభవించింది. యూనివర్సిటీలో బోధనలు ముగించుకుని వస్తున్న చైనా ఉపాధ్యాయులు ఓ వ్యాన్ లో వెళ్తున్న సందర్భంలో కార్ లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. మరణించిన చైనా లెక్చలర్లు చైనీస్ భాష బోధిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికంగా ఉన్న గుల్షాన్ ఇ ఇక్బాల్ ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన కరాచీ యూనివర్సిటీ ప్రదేశాన్ని భద్రతా బలగాలు తమ అదుపలోకి తీసుకున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ సహాయంతో కార్ ను పేల్చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కార్ లో మొత్తం 7-8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు.