ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉగ్రవాదుల కలకలం సంచలనంగా మారింది. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్, పాకిస్తాన్ గూడచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చిలకపాలెం టోల్ గేటు వద్ద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని జాతీయ నిరోధక విభాగం కి సమాచారం ఇచ్చారు.
అతన్ని రహస్యంగా విచారిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే అసలు అతను శ్రీకాకుళం ఏ విధంగా వచ్చాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల జాలర్లను పాకిస్తాన్ విడిచిపెట్టింది. వారు ఏమైనా సహకరించారా అనే దాని మీద అధికారులు కూపీ లాగుతున్నారు. దీనిపై కేంద్ర హోం శాఖతో పాటుగా నిఘా వర్గాలు కూడా దృష్టి సారించాయని అంటున్నారు. అతని సమాచారాన్ని ముందు నిఘా వర్గాలే అందించాయని సమాచారం.
ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది మీద పాకిస్తాన్ గురిపెట్టిందని అంటున్నారు. ఉత్తరాదిలో తమ కార్యాకలాపాలను ఉగ్రవాదులు కొనసాగించలేకపొతున్నారు. దీనితోనే దక్షిణాదిలో కీలక నగరాలుగా ఉన్న విశాఖ, హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగుళూరుని వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అతన్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.