ఆమె గొంతు బొంగురుపోయింది. గద్గద స్వరంతో తండ్రిని గుర్తుకు తెచ్చుకుంది. తన నియోజకవర్గంలోని ప్రజలతో ఆడబిడ్డను వచ్చాను.. ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోండి అంటూ ఆమె మాట్లాడిన మాటలు మునుగోడు ప్రజల గుండెను తడిమాయి. ఆమే.. పాల్వాయి స్రవంతి. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న స్రవంతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం నామినేషన్ అనంతరం మాట్లాడుతుండగా ఆమె గొంతు బొంగురుపోయింది. కంటతడి పెట్టింది.
తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ.. ఈరోజు నాన్నలేని లోటు నాకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రిస్థానం తీసుకుని, నాతోపాటు నడవాలని నా చేతులు చాచి, నా కొంగు చాచి ప్రాదేయపడుతున్నాను. మీ ఒక్క ఓటు, మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకే వెయ్యాలని కోరుతున్నా అంటూ గద్గదస్వరంతో మాట్లాడటం అక్కడికి వచ్చిన ప్రజల గుండెను తడిమింది.