పాల్వంచ ఘటన… వనమా రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయి.- ఏఎస్పీ రోహిత్ రాజ్.

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగించింది పాల్వంచ రామక్రిష్ణ కుటుంబం హత్య కేసు. కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవపై ప్రధాన ఆరోపణలు రావడంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేశాయి. తాజాగా ఈ కేసు విషయాలను మీడియాకు వెల్లడించారు ఏఎస్పీ రోహిత్ రాజ్. ఈనెల 3న రామక్రిష్ణ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని…ఘటన స్థలంలో సూసైడ్ నోట్ తో పాటు ఆత్మహత్యకు ముందు రామక్రిష్ణ సెల్ఫీ వీడియో ద్వారా వనమా రాఘవేంద్రపై ఆరోపణలు చేశారని… అయితే ఘటన జరిగిన 3 తేదీనే రామక్రిష్ణ బావమరిది జనార్థర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశామని ఏఎస్పీ వెల్లడించారు.

రామక్రిష్ణ ఆత్మహత్య కేసులో వనమా రాఘవేంద్రను అరెస్ట్ చేశామని.. ఇప్పటికే ఆయనపై 12 కేసుల ఉన్నాయని.. వీటన్నింటిని కూడా విచారిస్తున్నామని.. ఆయన దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం రాబట్టామని ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించి 302, 306,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వనమా రాఘవేంద్రను దమ్మపేట మండలం.. మందలపల్లి వద్ద ఈరోజు తెల్లవారు జామున అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇందుకు సహకరించిన గిరీష్, మురళి, శ్రీనివాస రావు, రమణలపై  సెక్షన్ 202 కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు.