సాధారణంగా పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు మాదిరే పాన్ కార్డు కూడా కీలకమైన ధ్రువీకరణ పత్రం. అయితే పాన్ కార్డు కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అన్నది ఇప్పటి వరకు ఉన్న నిబంధన. లేకుంటే లావాదేవీల నిర్వహణకు వీలుకాక వెనుదిరిగే సందర్భాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇంటర్‌ఛేంజబిలిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దీంతో పలు సందర్భాల్లో పాన్ కార్డు బదులు ఆధార్ కార్డు ఉపయోగిస్తే సరిపోతుంది. దీన్ని అనుసరించి ఒకవేళ ఎక్కడైనా పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం వస్తే ఆధార్ నంబర్‌ను చూపి పని పూర్తి చేసుకోవచ్చు. బడ్జెట్ 2019 సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాన్- ఆధార్ ఇంటర్‌ఛేంజబిలిటీని ప్రతిపాదించారు. తాజాగా దీన్ని ఆమోదించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తన రూల్స్‌లో నోటిఫై చేసింది.