దుబ్బాక ఉపఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గల్లీ గల్లీ..ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు నేతలు. సెంటిమెంటే ప్రధాన అస్త్రంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటుండగా…ఒక్కసారి అవకాశమివ్వాలంటూ కమలం దుబ్బాక ప్రజలను కోరుతోంది.
దుబ్బాక ఉపఎన్నికను గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రతి ఓటరును ప్రసన్నం చేసుకుంటూ…తమకే ఓటు వేయాలని నేతలు అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధికి చిరునామా తామంటే తామేనంటూ టీఆర్ఎస్- కాంగ్రెస్‌లు సవాల్‌లు ప్రతి సవాల్‌లు విసురుకుంటున్నాయి. త్రిముఖ పోరులో తమదే గెలుపంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
టీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు అన్నితానై ప్రచారం ఉరకలెత్తిస్తుండగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్,భట్టి,రేవంత్ ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దుబ్బాక ఎన్నికను పర్యవేక్షిస్తున్నాడు. అధికార విపక్షాలు ఒకరి పై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ మరోవైపు ఎలక్షన్ మేనేజ్ మెంట్ ప్యూహానికి పదును పెట్టాయి.
ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 9న దుబ్బాక ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇవాల్టితో నామినేషన్ గడువు ముగుస్తుంది. 17న నామినేషన్ల పరిశీలన… 19న ఉపసంహరణకు ఆఖరు తేదీగా నిర్ణయించారు. దుబ్బాకలో నవంబర్ 3న పోలింగ్ …10న కౌంటింగ్ జరగనుంది.