దివ్యాంగులను హేళన చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విశాఖ జనవాణి కార్యక్రమంలో దివ్యాంగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దివ్యాంగులలో అపరిమితమైన ప్రతిభ దాగి ఉంటుందన్నారు. జనసేన ప్రభుత్వం వచ్చాక వారికి అండగా ఉంటామని, అధికారులే దివ్యాంగుల వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారి ప్రతిభకు తగినట్లు ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తే ఉన్నతస్థాయికి వెళ్తారన్నారు. 2016 దివ్యాంగుల చట్టం సక్రమంగా అమలు చేయడంతో పాటు వారిని చులకనగా మాట్లాడినా, అపహాస్యం చేసినా శిక్షపడేలా కొత్త చట్టాలు తీసుకు వస్తామన్నారు.
తాను ఉషోదయ జంక్షన్ జీవీఎంసీ స్థలంలో కొంత భాగాన్ని లీజ్‌కు తీసుకొని దివ్యాంగుల స్కూల్ నడిపిస్తున్నానని దాని యజమాని జనవాణిలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు వేధించి… తన స్కూల్ ని కరోనా సమయంలో మూయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల పిల్లల కోసం ఉచితంగా స్కూల్ నడిపిస్తున్నానన్నారు. వైసీపీ నేతల వేధింపుల కారణంగా 200 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని పవన్ దృష్టికి యాజమాన్యం తీసుకువెళ్లింది.