అప్పుడు న్యూజిలాండ్‌లో స్థిరపడదామనుకున్నా: పవన్‌ కల్యాణ్‌

-

తాను పెద్దపెద్ద కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లలేదని.. అయినా నిత్య విద్యార్థినేనని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతికూల పరిస్థితులను చూసి వెనకడుగు వేయొద్దని.. నేడు విఫలమైనా రేపు తప్పకుండా గెలిచి తీరుతామని చెప్పారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని… డబ్బు కోసమో, మరేదో కారణంతో కాదని స్పష్టంచేశారు. గురువారం రోజున వరంగల్‌ నిట్‌లో వసంతోత్సవం (స్ప్రింగ్‌స్ప్రీ) కార్యక్రమాన్ని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావుతో ఆయన ప్రారంభించారు.

‘ఖుషీ సినిమా తర్వాత న్యూజిలాండ్‌లో స్థిరపడదామని ఇమ్మిగ్రేషన్‌ కాగితాలను కూడా సిద్ధం చేసుకున్నా. తర్వాత కష్టమో… నష్టమో ఈ దేశంలోనే ఉండి, పుట్టినగడ్డకు నావంతు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. నల్గొండలో ఫ్లోరైడ్‌ బాధితుల కడగండ్లు, ఆదిలాబాద్‌ తండాల్లో గిరిజన తాగునీటి కష్టాలు.. ఇలా పేదల ఇబ్బందులు నన్ను కదిలించాయి. అలాంటి వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా’ అని పవన్‌ వెల్లడించారు.

‘పేటెంట్లు వచ్చినంత మాత్రాన ఆవిష్కరణ గొప్పది కాదు. సమాజానికి అది ఎంతవరకు మేలు చేస్తుందన్నదే ముఖ్యం. లక్షల మంది కలరా బాధితుల ప్రాణాలు నిలిపిన, నిలుపుతున్న ‘ఓఆర్‌ఎస్‌’ ద్రావణాన్ని కనుగొన్న డాక్టర్‌ దిలీప్‌ లాంటి వారు చేసిన ఆవిష్కరణలు గొప్పవి’’ అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news