జగన్ రైతు భరోసాపై.. పవన్ కల్యాణ్ ఏమంటున్నాడంటే..?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ జగన్ ప్రారంభించిన రైతు భరోసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేసింది ఒకటి అంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ ఇచ్చిన రైతు భరోసా వాగ్దానం అసంపూర్ణంగా మిగిలిపోయింది అంటూ కామెంట్ చేశారు.

రైతు భరోసా పధకాన్ని కేంద్ర పథకమైన కిసాన్ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేకపోయారని పవన్ కామెంట్ చేశారు. ప్రతీ రైతు కుటుంబానికి 12500 రూపాయలను ప్రతి ఏటా అందిస్తామని తన నవరత్నాలలోను, ఎన్నికల ప్రణాళికలోను ఘనంగా ప్రకటించిన విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కిసాన్ యోజన పథకంలోని ఆరువేల రూపాయలను కలిపి 13500 రూపాయలను ఇవ్వడం ఎంతవరకు సమంజసం ? అని ప్రశ్నించారు.

మీరు నవరత్నాల ప్రకటన విడుదల చేసినప్పుడు రైతు భరోసాను కేంద్ర ప్రభుత్వం సాయంతో ఈ పథకాన్ని రూపొందిస్తామని ఎందుకు చెప్పలేదు? అని పవన్ ప్రశ్నిస్తున్నారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 12500 రూపాయలకు కేంద్రం సాయం ఆరువేల రూపాయలు కలిపి మొత్తం 18500 రూపాయలను రైతులకు అందించాలని జనసేనాని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అంత మొత్తాన్ని ఇవ్వలేకపోతే అందుకు కారణాలను రైతులకు చెప్పాలని సూచించారు.

వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలి. అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఎన్నికల ప్రణాళికను తు.చ.తప్పక అమలుచేయాలన్నది సహజ న్యాయ సూత్రం..అంటూ పవన్ జగన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొందని… రాష్ట్రంలో ఈ పథకానికి అర్హులైన వారు సుమారు 86 లక్షల మంది ఉండగా దీనిని 40 లక్షల మంది రైతులకే పరిమితం చేయడం చాలా అన్యాయమని పవన్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news